వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ముద్రగద కోలుకోవడంతో ఆయన అభిమానులు, రాజకీయ అనుచరులు విశేషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెండు వారాలుగా ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతూ కాకినాడలోని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం పరిస్థితి మెరుగుపడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను స్వగ్రామమైన కిర్లంపూడికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి ప్రత్యేక వాహనంలో తరలించి వైద్యం అందించారు.
సుదీర్ఘ చికిత్సా సమయంలో ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. గతంలో ఆయన కుమార్తె క్రాంతి మీడియాతో మాట్లాడుతూ ముద్రగడకు క్యాన్సర్ ఉన్నట్టు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కుటుంబ సభ్యులు స్పందించకపోయినా, ముద్రగడ స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయినా, వెంటనే తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరడం అభిమానులను కలవరపెట్టింది.
ఆయన కొలుకోవడంతో ముద్రగడ తనయుడు ముద్రగడ గిరి స్పందిస్తూ .. ఇలాంటి కష్ట సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారికి, బొత్స సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పార్టీలకు అతీతంగా మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం అని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్ ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ, ముద్రగడ సూచన మేరకు కిర్లంపూడి మీదుగా హైదరాబాద్‌కి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ఆయన స్వస్థలానికి చేరుకున్నారు.
ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు. ఆయన ఆరోగ్యవంతంగా తిరిగి రావడంపై వైసీపీ శ్రేణులు, కాపు సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే ముద్రగడ తిరిగి ప్రజలమధ్యకి వస్తారని భావిస్తున్నారు.
