నిరుద్యోగ భృతికి 2 లక్షల మందే అర్హులా ? ఏదో జరుగుతోంది

నాలుగున్నరేళ్ళుగా చంద్రబాబునాయుడు ఊరించి ఊరించి మొత్తానికి అమల్లోకి తెస్తున్న నిరుద్యోగ భృతిలో కూడా భారీగా  కోత వేస్తున్నట్లు అనుమానంగా ఉంది.  గాంధీ జయంతైన ఈరోజు నుండి అమల్లోకి వస్తున్న ఈ పథకంలో అర్హులుగా కేవలం 2 లక్షల మందిని మాత్రమే గుర్తించారు. నిరుద్యోగ భృతికి సంబంధించి చంద్రబాబు హమీకి ఇపుడు అమలవుతున్న పథకినికి చాలా తేడా ఉంది. దాంతో ప్రభుత్వ తాజా ప్రకటనతో ఈ పథకం కూడా రుణమాఫీ పథకం లాగా నీరుకారిపోతుందా అన్న అనుమానం మొదలైపోయింది.

ఎందుకంటే, పోయిన ఎన్నికల సమయంలో తెలుగుదేశంపార్టీ నేతల చెప్పినదాని ప్రకారం రుణమాఫీ సుమారు లక్ష కోట్ల రూపాయలు. రుణమాఫీకి సంబంధించి ఎన్నో హమీలిచ్చారు. దాంతో అమయాక రైతులతో పాటు వారి కుటుంబాలంతా చంద్రబాబును నమ్మి టిడిపికి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ అమలుకు  ఎన్నో షరతులు తీసుకొచ్చారు. రకరకాల నియమ నిబంధనల పేరుతో అంతకుముందు తాము చెప్పిన లక్ష కోట్ల మొత్తాన్ని రూ. 30 వేల కోట్లకు పట్టుకొచ్చేశారు. దాంతో రైతులు లబోదిబోమంటున్నారు.  

 

అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి పథకాన్ని చంద్రబాబు పక్కనపెట్టేశారు. దాంతో నిరుద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఏళ్ళ తరబడి పోరాటంతో పాటు మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో హఠాత్తుగా చంద్రబాబుకు తన హామీ గుర్తుకువచ్చింది. దాంతో వెంటనే పథకానికి దుమ్ముదులిపి విధివిధానాలను తెరపైకి తెచ్చారు.

రకరకాల వడపోతల తర్వాత  ప్రభుత్వ లెక్కల ప్రకారమే భృతికి అర్హులైన నిరుద్యోగుల సంఖ్య 10 లక్షలు. కానీ ఇపుడు లోకేష్ చెబుతున్న దాని ప్రకారం 6 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారట. అందులో అర్హులు కేవలం 2 లక్షలేనట.  లోకేష్ చెప్పింది నిజమే అయితే మిగిలిన 4 లక్షల మంది ఏమైనట్లు ? అర్హులైన నిరుద్యోగులు 10 లక్షలుంటే 6 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవటమేంటి ? మిగిలిన వారెందుకు దరఖాస్తు చేసుకోలేదు ? నెలకు వెయ్యి రూపాయల భృతి ఇస్తామంటే దరఖాస్తు వద్దనే నిరుద్యోగులుంటారా ? ఎక్కడో ఏదో జరుగుతోంది. అదేంటో తెలియాలంటే వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా ఆన్ లైన్లో ఉంచాలి. అప్పుడు కానీ ప్రభుత్వం లోగుట్టు బయటపడదు. మొత్తానికి నిరుద్యోగ భృతి కూడా రుణమాఫీ పథకం లాగే బ్రహ్మపదార్ధం ఎవరికీ అర్ధం కాకుండా తయారయ్యేట్లుంది.