ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బార్ లైసెన్స్‌ల దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. మొదట ప్రకటించిన గడువు నేటితో ముగిసినప్పటికీ, ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో అధికారులు పునరాలోచనకు వెళ్లారు.
ఎక్సైజ్ శాఖ సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తం 840 బార్లకు కేవలం 90 దరఖాస్తులే వచ్చాయి. కొత్త పాలసీ ప్రకారం ఒక బార్‌కు కనీసం 4 దరఖాస్తులు రావాలి. ఇప్పటి వరకు కేవలం 9 బార్లకే ఈ అర్హత వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో, బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువును ఆగస్టు 29 సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ప్రకటించారు. అలాగే లాటరీ డ్రా ఆగస్టు 30 ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వినాయక చవితి, వరుసగా వచ్చిన బ్యాంకు సెలవులు, నిరంతర వర్షాలు, వరదల కారణంగా దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు ఎదురైనందున గడువు పొడిగించామని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.


