చంద్రబాబుకు ఎన్టీఆర్ సలహా ఇచ్చాడట: నమ్మేద్దామా.?

సిన్న ఎన్టీఓడికి చంద్రం మామ ఫోన్ చేసినాడట. తాత పెద్ద ఎన్టీఓడు పెట్టిన తెలుగుదేశం పార్టీని ఎలా బాగుచేసుకోవాలో అని ఆలోచించేస్తూ, సిన్న ఎన్టీఓడు కొన్ని ప్లానింగులు చేసినాడట. వాటన్నింటినీ చంద్రం మామకు వివరించినాడట. పోలా.. స్ర్కిప్టు అదిరిపోలా.!

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడు, ఎలా మారిపోతాయో ఎవ్వరం చెప్పలేం. అది 2009 ఎన్నికల సమయం. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పటికి ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న కోణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ప్రచారం కోసం తీసుకొచ్చారు. ఆ ప్రచార సమయంలోనే ఎన్టీఆర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తూ ప్రాణ గండం తప్పింది.

కానీ, తన శక్తికి మించి టీడీపీ కోసం ప్రచారం చేశాడు ఎన్టీఆర్. ఏం లాభం.? వాడుకుని వదిలేయడం బాగా తెలిసిన చంద్రబాబు, ఆ తర్వాత ఎన్టీఆర్‌ని పక్కన పడేశాడు. ఎన్టీఆర్‌ని తొక్కేసి, లోకేష్‌ని రాజకీయాల్లోకి లాక్కొచ్చి, నానా తంటాలూ పడుతున్నాడు. పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిన ఈ దశలో చంద్రబాబుకి మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో అవసరం పడింది.

ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య రాజకీయ చర్చలు మొదటయ్యాయని ప్రచారం జరుగుతున్నా, అదంతా ఉత్త ప్రచారమనీ, ఎన్టీఆర్ సన్నిహితులు అంటున్నారు. కొన్నాళ్ల క్రితం కూకట్‌పల్లి నియోజక వర్గ ఉప ఎన్నికలో ఎన్టీఆర్ సోదరి సుహాసిని బరిలోకి దిగి ఓటమి చెందారు.

ఓడిపోయే సీటులో ఆమెను నిలబెట్టి చంద్రబాబు హరికృష్ణ కుటుంబాన్ని అవమానపరిచారనే విమర్శ అప్పట్లో వచ్చింది. ఎన్టీఆర్ గానీ, కళ్యాణ్ రామ్ గానీ ఆ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన లేదు. తెలంగాణా రాజకీయాల్లో వేలు పెట్టి కెరీర్‌ని పాడు చేసుకోవడం ఎందుకు.? అని ఎన్టీఆర్ భావించి ఉండొచ్చు. కళ్యాణ్ రామ్ కూడా అదే ఆలోచన చేసి ఉండొచ్చు.

ఇంతకీ, చంద్రబాబు కోరితే ఎన్టీఆర్ ఈ సారి టీడీపీ కోసం ప్రచారం చేస్తారా.? చేయరా.? అస్సలు అలాంటి అవకాశమే లేదని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు కుండ బద్దలు కొట్టేస్తున్నాయ్. చంద్రబాబును నమ్మి వెళితే, ఎన్టీఆర్ బకరా అయిపోతాడని ఎన్టీఆర్ అభిమానులు కుండ బద్దలు కొట్టేస్తున్నారు.