Lalit Modi: లలిత్ మోడీ కొత్త గేమ్.. భారత ప్రభుత్వానికి మళ్లీ సవాల్?

ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ మరో కీలక నిర్ణయం తీసుకుని భారత పౌరసత్వానికి స్వస్తి చెప్పాడు. లండన్‌లో భారత హైకమిషన్‌కు తన పాస్‌పోర్ట్‌ను స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయడంతో, ఇకపై ఆయన భారత పౌరుడు కాదన్న స్పష్టత వచ్చింది. అయితే, మోడీ కొత్తగా దక్కించుకున్న వనౌటు పౌరసత్వంపై చర్చ మొదలైంది. దక్షిణ పసిఫిక్‌లోని ఈ చిన్న ద్వీప దేశం తక్కువ ఖర్చుతో పౌరసత్వాన్ని ఇస్తుండటంతో, వివాదాస్పద వ్యక్తులు తరచుగా అక్కడికి మారుతున్నారు. ఇప్పుడు లలిత్ మోడీ కూడా అదే దారిలో నడుస్తున్నాడా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి.

ఐపీఎల్‌లో అవినీతి ఆరోపణలు, అక్రమ లావాదేవీల కేసులు ఎదుర్కొంటున్న ఈ మాజీ లీగ్ చీఫ్ 2010 నుంచి లండన్‌లో ఉన్నాడు. తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, ఆయన పౌరసత్వం వదులుకున్నా, కేసుల విచారణ మాత్రం కొనసాగుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, భారత న్యాయ వ్యవస్థలో నిందితులను తిరిగి స్వదేశానికి రప్పించడంలో ఇప్పటివరకు ఎన్నో లోపాలు కనిపించాయి. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి కేసుల్లో ఎక్స్‌ట్రడిషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగింది.

వనౌటు లాంటి చిన్న దేశాల పౌరసత్వాలను పొందడం ద్వారా, నిందితులు చట్టాన్ని తప్పించుకునేందుకు మార్గం కనుగొంటున్నారా? అంతర్జాతీయ స్థాయిలో, కొన్ని దేశాలు సులభంగా పౌరసత్వాలను అందించడమే కాకుండా, ఎక్స్‌ట్రడిషన్ ఒప్పందాలు కూడా లేకపోవడంతో, అది అభయం పొందేందుకు మార్గంగా మారుతోంది. లలిత్ మోడీ కూడా దీన్ని ఎత్తుగడగా మార్చుకుని, తనపై ఉన్న కేసుల దిశను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాడా అనేది అసలు ప్రశ్న. అయితే లలిత్ పై ఉన్న కేసులు మాత్రం యధావిధిగా కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరి అతను ED అధికారులకు ఎప్పుడు చిక్కుతాడో చూడాలి.

ఉచిత బస్సు అంతా తుస్ || AP Women Free Bus Scheme | Latest Telugu News || Telugu Rajyam