నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి పరిస్థితి రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతోంది. కర్నూలు జైలులో ఉన్న పోసానిని పీటీ వారెంట్ ఆధారంగా విజయవాడ కోర్టుకు తీసుకురావడం, అక్కడ 20వ తేదీ వరకు రిమాండ్ విధించడం వివాదాస్పదంగా మారింది. జనసేన నేత శంకర్ ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవ్వడం, అదే వ్యవహారంపై పలు ప్రాంతాల్లో కేసులు పెట్టడం రాజకీయ కోణాన్ని మరింత బలపరుస్తోంది.
కోర్టులో హాజరైన సందర్భంగా పోసాని తన గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. ఒకే అంశంపై పలు ప్రాంతాల్లో కేసులు పెట్టి తనను రాజకీయంగా వేధిస్తున్నారని, తాను అనారోగ్యంతో ఉన్నా కోర్టులకు హాజరవ్వాల్సి రావడం, వరుసగా కేసుల తాలూకూ ఒత్తిడిని ఎదుర్కోవడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఆయన న్యాయమూర్తి ఎదుట ప్రస్తావించారు.
పోసాని వ్యాఖ్యలు గతంలో ఎప్పటికప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో ఆయన చేసిన కొన్ని విమర్శలు ప్రత్యర్థి శిబిరంలో తీవ్ర అసహనం రేకెత్తించాయి. ఇదివరకూ సినీ పరిశ్రమకు చెందిన పలువురు రాజకీయ వ్యాఖ్యలపై వివాదాల్లో చిక్కుకున్నా, ఇలా వరుసగా కేసులు, కోర్టు హాజరులు ఎదుర్కోవడం అరుదు. ఇక ఈ విషయంలో వైసీపీ నుంచి పోసానికి మద్దతు వస్తున్నప్పటికీ అంత హడావుడిగా కనిపించడం లేదు.