పవన్ కళ్యాణ్ నిత్య  పెళ్లి కొడుకు: వైఎస్ జగన్

పవన్ కళ్యాణ్ నిత్య పెళ్లి కొడుకని ఆయనేమి రాజకీయాలు చేస్తారని వైఎస్ జగన్ విమర్శించారు. సంవత్సరం ఇంట్లో ఉండి ఒక్క  రోజు రాజకీయం చేసే పవన్ గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు.  ఏపిికి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ తో వైసిపి ఇచ్చిన బంద్  విజయవంతమైందన్నారు.  జగన్ ఇంకా ఏమన్నారంటే

“ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ బంద్ ను విఫలం చేయడానికి ప్రభుత్వం చేయని కుట్రలేదు. అన్ని జిల్లాల్లో వేల మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలు స్వచ్చంధంగా బంద్ లో పాల్గొన్నారు. మహిళలని కూడా చూడకుండా వారిపట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారు. విద్యార్థులను ఈడ్చుకెళుతూ రోడ్లపై తన్నుకుంటూ తీసుకెళ్లారని ఇది సరైన పద్దతేనా అని నేను ప్రశ్నిస్తున్నాను.

చంద్రబాబు గారు మీరు 25 మంది ఎంపీలతో రాజీనామా చేయించి బంద్ లో పాల్గొనాల్సింది పోయి బిజెపికి జై కొట్టారు. పోలీసులు అనుచిత ప్రవర్తనతో పశ్చిమ గోదావరి జిల్లాలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. ఈ రోజు దుర్గా ప్రసాద్ మరణానికి కారణం చంద్రబాబు. చంద్రబాబు చేస్తున్న మోసాలు తారాస్థాయికి చేరాయి. వంద తప్పులు చేసిన తర్వాత శిశుపాలునికి కూడా శిక్ష తప్పదు. చంద్రబాబు కూడా వంద తప్పులకు దగ్గరలో ఉన్నారు. త్వరలోనే వారికి ప్రజలు మొట్టికాయలు వేస్తారు. చంద్రబాబుకు సిగ్గు శరం ఉంటే ప్రత్యేక హోదా కోసం ముందుకు రావాలని అడుగుతున్నాను. చంద్రబాబును భావితరాలు చరిత్ర హీనునిగా గుర్తుపెట్టుకుంటాయి. చంద్రబాబునాయుడు బిజెపితో నాలుగేళ్లు సంసారం చేసి ఎన్నికలకు ఆరునెలలు ముందు విడాకులు  తీసుకొని నాటకాలాడుతున్నాడు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త  వద్దంటుదా అనే తీరుగా ప్రవర్తిస్తాడు. ప్రత్యేక హోదా రాజకీయ అంశం కాదు ఏపి ప్రజల జీవితం. రాజకీయాలకు పోకుండా దీనికోసం కలిసి కట్టుగా ఉద్యమించాలి. హోదా కోసం చంద్రబాబు చేయవలసిన సమయంలో పనులు చేయకపోవడం వల్లే ఈ రోజు హోదా రాలేదు. హోదానే కావాలి ప్యాకేజి వద్దని ఆనాడే చెప్పాను. ప్రత్యేక హాదాకు చంద్రబాబు దగ్గరుండి తూట్లు  పొడుస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదు.

ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి  మాట్లాడుకోవడం కూడా సిగ్గుచేటు. ఆయన నిత్య పెళ్లి కొడుకు. సంవత్సరం ఇంట్లో ఉండి ఒక్క రోజు రోడ్డు మీదకు వస్తాడు. ఆయనేమి రాజకీయాలు చేస్తాడు”అని జగన్ విమర్శించారు.