అమ‌రావ‌తి బాండ్లు కొన్న‌దంతా టిడిపి నేత‌లేనా ?

మొద‌టి నుండి అంద‌రూ అనుమానిస్తున్న‌ట్లే అమ‌రావ‌తి రాజ‌ధాని బాండ్ల క‌థ తెలుగుదేశంపార్టీలోనే తేలుతోంది. రాజ‌ధాని నిర్మాణం పేరుతో ఆమ‌ధ్య సిఆర్డిఏ రూ. రుణాల సేక‌ర‌ణ ల‌క్ష్యంతో బాండ్లు జారీ చేసిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. బాండ్లు అమ్మ‌కానికి ఉంచిన అర్ధ గంట‌లోప‌లే రూ. 2 వేల కోట్లకు బాండ్లు అమ్ముడుపోయింది. దాంతో అద్భుత‌మంటూ ప్ర‌భుత్వం ఒక‌టే ఊద‌ర‌గొట్టటం మొద‌లైంది. అర్ధ‌గంట‌లోపే 2 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు రావ‌టం చాలా గొప్ప విష‌య‌మ‌ని, గతంలో ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేద‌ని చెప్పుకున్న‌ది. చంద్ర‌బాబునాయుడు మీదున్న న‌మ్మ‌కంతోనే ఇన్వెస్ట‌ర్లు ఈ స్ధాయిలో పెట్టుబ‌డులు పెట్టారంటూ ఒక‌టే ట‌ముకేసుకున్న విష‌యం తెలిసిందే.

ఇన్వెస్ట చేసిన వాళ్ళ వివ‌రాలు బ‌య‌ట‌పెట్ట‌మంటే మాత్రం ప్ర‌భుత్వం చెప్ప‌లేదు. ఇక్క‌డే అంద‌రిలో అనుమానం మొద‌లైంది. అయితే, వివిధ మార్గాల్లో ప్ర‌భుత్వంపై వ‌చ్చిన ఒత్తిళ్ళు, ఆరోప‌ణ‌ల‌, విమ‌ర్శ‌ల కార‌ణంగా పెట్టుబ‌డులు పెట్టిన తొమ్మిదిమంది ఇన్వెస్ట‌ర్లలో న‌లుగురి పేర్ల‌ను మాత్రం చెప్పింది. వారిలో కూడా ఎవ‌రెంత పెట్టుబ‌డులు పెట్టింది, మిగిలిన పెట్టుబ‌డిదారులెవ‌రు అంటే మ‌ళ్ళీ స‌మాధానం చెప్ప‌లేదు. కొద్ది రోజుల త‌ర్వాత పెట్టుబ‌డిదారుల్లో ఫ్రాంక్లిన్ టెంపుల్ ట‌న్ ఒక్క‌ సంస్ధే రూ . 1300 కోట్లు పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు చెప్పారు. దాంతో అంద‌రి అన‌మానాలు బ‌ల‌ప‌డ్డాయి.

 

ఎందుకంటే, ఫ్రాంక్లిన్ టెంపుల్ ట‌న్ సంస్ధ అనేది మ్యూచువ‌ల్ ఫండ్స్ లో పెట్టుబ‌డులు పెట్టేది. ఇన్వెస్ట‌ర్ల నుండి పెట్టుబ‌డులు సేక‌రించి మ్యూచువ‌ల్ ఫండ్స్ లో పెట్టి లాభాలొస్తే దాన్ని పంచే సంస్ధ‌. అంతేకానీ త‌నంత‌ట తానుగా ఎక్క‌డా పెట్టుబ‌డులు పెట్ట‌దు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌రి అటువంటి సంస్ద అమరావతి బాండ్ల‌లో ఎందుకు పెట్టుబ‌డులు పెడుతుంది ? ఇక్క‌డే సిస‌లైన రాజ‌కీయం ఉంద‌నే అనుమానాలు మొద‌ల‌య్యాయి.

ఫ్రాంక్లిన్ టెంపుల్ ట‌న్ సంస్ద‌లో తెలుగుదేశంపార్టీకి చెందిన కొంత‌మంది పెట్టుబ‌డులు పెట్టి సంస్ధ ద్వారా అమ‌రావ‌తి బాండ్ల‌ను కొనుగోలు చేయించార‌నే అనుమానాలు పెరిగిపోతున్నాయ్. అదే విధంగా మిగిలిన రూ . 700 కోట్ల విలువైన బాండ్ల‌ను కొన‌టానికి ఎవ‌రూ రాక‌పోతే చివ‌ర‌కు పెట్టుబడిదారుల‌ను తెచ్చే అరేంజ‌ర్ అనే బ్రోక‌ర్ సంస్ధే కొన్న‌ద‌ట‌. అంటే ఇందులో కూడా త‌మ్ముళ్ళ పెట్టుబ‌డే ఉంద‌ని అనుమానం వ‌స్తోంది. మొత్తం మీద అమ‌రావ‌తి బాండ్ల క‌థ అటు తిరిగి ఇటు తిరిగి తెలుగుదేశంపార్టీ నేత‌ల ద‌గ్గ‌రే తేలుతోంది.