అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి మెడకు ఎన్నికల ఉచ్చు బిగుసుకోనున్నదా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అర్దమవుతోంది. మొన్నటి ఎన్నికల గురించి మీడియాతో జేసి మాట్లాడుతూ తము కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. సుమారు రూ 50 కోట్ల దాకా తమకు ఖర్చయిందన్నారు. ఓటుకు 2 వేల రూపాయలు ఇచ్చుకున్నట్లు కూడా చెప్పారు. ఎన్నికల్లో పెరిగిపోతున్న వ్యయం గురించి మాట్లాడుతునే తాము చేసిన ఖర్చును గొప్పగా చెప్పుకున్నారు.
మీడియాతో చేసిన ప్రకటన ఇపుడు జేసి కొంప ముంచబోతోందని సమాచారం. అనంతపురం ఎంపిగా జేసి దివాకర్ రెడ్డి కొడుకు జేసి పవన్ రెడ్డి, తాడిపత్రి ఎంఎల్ఏగా జేసి ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసి అస్మిత్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసింది కొడుకులే అయినా మొత్తం వ్యవహారం నడిపిందంతా జేసి బ్రదర్సే అన్న విషయం బహిరంగ రహస్యం.
జేసి చేసిన బహిరంగ ప్రకటనపై చర్యలు తీసుకోవాలంటూ రాజకీయ పార్టీలు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు చేశాయి. ఈసి ఆదేశాలతో తాడిపత్రి రిటర్నింగ్ అధికారి విచారణ జరిపారు. జేసి వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ క్రిందకు వస్తాయని నిర్ధారించారు. ఈ మేరకు నివేదికను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కు అందించారట. కలెక్టర్ కూడా అదే నివేదికను ఈసికి పంపారు.
ఈసి ఆదేశాలు రావటమే తరువాయి జేసిపై యాక్షన్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. మరి యాక్షన్ అంటే ఏ రూపంలో ఉంటుందో అర్ధం కావటం లేదు. పోయిన ఎన్నికల్లో సత్తెనపల్లిలో రూ. 11 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పిన కోడెల శివప్రసాదరావు కోర్టు కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.