తెలుగు రాష్ట్రాలలో బీజేపీ సరికొత్త వ్యూహాన్ని అమలుచేస్తుందా? ఒకసారి కూడా వికసించని కమళాన్ని వికసింపచేసేందుకు రంగం సిద్దమయ్యిందా? అధికారాన్ని కాకపోయినా ప్రధాన ప్రతిపక్షంలోనైనా నిలవాలని కోరుకుంటుందా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పార్టీల హవా కొనసాగినప్పుడు మూడు లేదా నాలుగో స్థానంలో కొనసాగిన బీజేపీ రాష్ట్ర విభజన తరువాత కూడా అదే స్థానంలో నానుతూ వస్తుంది. ఎన్ని ప్రాయాసలు పడుతున్నా, ఎందరితోనే చేతులు కలుపుతున్నా తెలుగు రాష్ట్రాలలో కాషాయపు పార్టీ ఫీట్ మాత్రం మారడంలేదనే చెప్పాలి.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం అయినా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, టీడీపీల మధ్యనే కొనసాగేది. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఎలాగో అధికారం చేపట్టలేదు. కనీసం విభజన జరిగి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత అయిన అధికారం చేపట్టాలని అనుకున్న ఆ ఆశలు కూడా బీజేపీకి అడియాశలు అవుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం 2014 లో ఎన్నికలు రావడంతో అప్పటికే కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచింది. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలవడంతో మళ్ళీ బీజేపీ అదే మూడు, నాలుగో స్థానానికి పరిమితమయ్యింది. సరే ప్రాంతీయ పార్టీ, ఉద్యమ ఊపుతో గెలుపొందిందిలే అని చాలా మంది లైట్ తీసుకున్నా ఐదేళ్ళు తిరగకుండానే ముందస్తు ఎన్నికలకు పోయి సీఎం కేసీఆర్ అందరికి షాక్ ఇచ్చారు. 2018 ముందస్తు ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో రెండోసారి కూడా టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఈ ఎన్నికలలో కూడా బీజేపీది అదే ఫీట్. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. తరువాత కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడంతో ప్రతిపక్ష హోదాను కోల్పోవడం వేరే విషయం అనుకోండి.
ఇక ఏపీ విషయానికి వస్తే రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలతో కూడిన ఏపీలో అప్పటికే తండ్రి మరణం అనంతరం కాంగ్రెస్‌తో విబేంధించిన వైఎస్ జగన్ వైస్సార్‌సీపీ పేరిట ప్రాంతీయ పార్టీనీ నెలకొల్పి ఊపుమీద ఉన్నాడు. ఇక తెలంగాణలో నూకలు చెల్లేలా లేవన్న టీడీపీ తట్టాబుట్టా సర్ధుకుని పూర్తిగా ఏపీలోనే బలోపేతమయ్యింది. అయితే 2014 ఎన్నికలలో తండ్రి సెంటిమెంట్‌తో జగన్ గెలుస్తాడని, వైసీపీ అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నా మెజారిటీ జనం మాత్రం చంద్రబాబు నాయుడు అనుభవానికే పట్టం కట్టి టీడీపీనీ గద్దెనెక్కించారు. ఇక్కడ ఓ విషయం గుర్తించుకోవాలి ఈ ఎన్నికలలో టీడీపీ గెలుపుకు బీజేపీ, పవన్ కళ్యాణ్‌లు మద్ధతు తెలిపారు. ఏదేమైనా ఈ ఎన్నికలలో బీజేపీ మూడు, నాలుగు స్థానాలకే పరిమితం. ఇక 2019 ఎన్నికలొచ్చేసరికి ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ, వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయన్న సమయంలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన మూడో ప్రాంతీయ పార్టీగా రంగప్రవేశం చేసింది. ఇంకేముంది బీజేపీ ఆశలు అడియాశలు అయ్యాయి. అంతలోనే 2019 ఎన్నికలు రావడం తొలిసారి వైసీపీ అధికారాన్ని చేపట్టడం, అధికారంలో ఉన్న టీడీపీ ప్రతీపక్షానికి పడిపోవడం జరిగిపోయింది. ఇక కనీసం మూడు, నాలుగో స్థానమైన ఉందేమో అని చూస్తే జనసేన అడ్డంకి కనిపించడం. ఇక ఏపీలో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం శూన్యమనే చెప్పాలి.
అయితే కేంద్రంలో 2014, 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు బీజేపీ అధికారాన్ని చేపట్టినా ఆ ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలలో కొంచెం కూడా కనిపించలేదనే చెప్పాలి. అందుకే ఎలాగైనా తెలుగురాష్ట్రాలలో పాగా వేయాలని అధికారం కాకపోయినా కనీసం ప్రధాన ప్రతిపక్షం దక్కించుకుని అయినా నంబర్ 2లో నిలవాలని కాషాయ దళం భావిస్తుందట. అందుకే పార్టీలోకి భారీగా చేరికలను ప్రోత్సహిస్తూ, యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న జనసేనతో చేతులు కలుపుకుంది. ఇక ఇదే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో అధ్యక్షుడిని మార్చైనా అధికారం కోసం పోరాడాలని భావించి రెండు తెలుగు రాష్ట్రాల అద్యక్షులను కూడా వెనువెంటనే మార్చేసింది. మరీ అద్యక్షుల మార్పైనా బీజేపీకి కలిసొచ్చి అధికారం తెచ్చిపెడుతుందా లేక ప్రధాన ప్రతిపక్షాన్నైనా తెచ్చిపెడుతుందా అన్నది చూడాలి మరీ.