నెల్లూరులో పోలీస్ స్టేషన్ పై దాడి : ఎస్సైని చితకబాదిన జనం

నెల్లూరు జిల్లా రావూరు పోలీసు స్టేషన్ పై గ్రామస్థులు దాడికి దిగారు. మహిళలు, యువకులు మూకుమ్మడిగా దాడికి దిగడంతో రావూరు పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పెద్ద సంఖ్యలో జనాలు స్టేషన్ పై ఎటాక్ చేశారు. ఈ దాడిలో మహిళలు కూడా ఉన్నారు. స్థానికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తిని స్థానిక ఎస్సై లక్ష్మీకాంతరావు కొట్టాడు. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో రావూరు పోలీసు స్టేషన్ ఎటాక్ చేసి ఎస్సై తో పాటు పోలీసు కానిస్టేబుళ్లను కూడా చికతబాదారు. గ్రామస్థులంతా మూకుమ్మడిగా స్టేషన్ మీద దాడి చేయడంతో భయకంపితుడైన ఎస్సై ప్రాణ రక్షణ కోసం సెల్ లోపలికి వెళ్లి దాచుకున్నాడు. అయినప్పటికీ జనాలు వదలకుండా బయటకు లాక్కొచ్చి మరీ కుమ్మేశారు. చెప్పులు, కుర్చీలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

అయితే తమ గ్రామానికి చెందిన యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడగా ఆ యువకుడిని ఎస్సై చితకబాదాడని, అందుకే వారంతా ఆగ్రహంతో పోలీసుల మీద తిరగబడ్డారని అంటున్నారు. పోలీసుల దాడిలో ఆ యువకుడి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో యువకుడి బంధువులంతా ఏకమై స్టేషన్ మీద ఎటాక్ చేసి పోలీసులను చితకబాదారు. గ్రామస్థుల దాడిలో గాయపడిన ఎస్సై కి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ సంఘటన నెల్లూరులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై ఎపి పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. పోలీసు స్టేషన్ పై దాడి జరగడంతో రావూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.