చల్లటి గాలి.. నిండు వెన్నెలని ఆస్వాదిస్తూ పేకాట ఆడదామని జూదరాయుళ్లు భావించారు. ఇందుకోసం ఏకంగా నది మధ్యలో మకాం పెట్టారు. నీళ్లు లేవు కదా హాయిగా మూడు ముక్కలు ఆడి డబ్బులు జేబులో వేసుకుందామనుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అటు ఇటు నీళ్లు రావడంతో ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లబోదిబోమన్నారు. చివరకు పోలీసులు రక్షించడంతో బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.
అసలు ఏం జరిగిందంటే.. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ సమీపంలో పెన్నా నది ఉంది. కొంతమంది యువకులు సోమవారం రాత్రి పూట పేకాట ఆడేదంఉకు నది మధ్యలోకి వెళ్లారు. ముక్కలు వేసుకుంటున్నారు.. అయితే సోమశిల రిజర్వాయర్ నుంచి అధికారులు నీళ్లు విడుదల చేయడంతో నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో వీరు కూర్చున్న రెండు వైపుల నుంచి పెద్ద ఎత్తును నీరు వచ్చింది. దీంతో ప్రాణభయంతో యువకులు కాపాడండి.. కాపాడండి అంటూ తీవ్ర భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. వీరి కేకలు గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు యువకులను రక్షించేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఆ ప్రాంతం చేకటిగా ఉండటంతో ఆక్సా లైట్లను ఏర్పాటుచేసి మరి యువకులను రక్షించందుకు ప్రయత్నాలు చేశారు. వంతెనపై నుంచి రోప్స్ నిచ్చెనల సాయంతో వారిని పైకి తీసుకొచ్చారు. దాదాపు 6 గంటలు పాటు శ్రమించి యువకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే కొంతమంది యువకులు మాత్రం పోలీసు కేసు భయంతో పక్కకు వెళ్లిపోయారు. వారికిని కూడా సురక్షితంగా రక్షించి పైకి తీసుకొచ్చారు. దీంతో కుటుంబసభ్యులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి పోలీసులకు కీలక సూచనలు చేశారు.
కాగా గతంలో కోనసీమ జిల్లాలోనూ కొంత మంది యువకులు బర్త్ డే పార్టీ చేసుకోవడానికి పడవ వేసుకుని గోదావరి నది మధ్యలోకి వెళ్లారు. ఆ సమయంలో పడవకు మంటలు అంటుకోవడంతో ప్రాణభయంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సమాచారం అందుకుని వారిని సురక్షితంగా రక్షించారు.
