మద్యం, మైనింగ్ సహా పలు కేసుల్లో అరెస్టై నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన, ప్రభుత్వంపైనా, అధికారులపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విడుదలకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
జైల్లో అంతా మనవాళ్లే.. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాణి, “నెల్లూరు జైల్లో ఉన్నవారంతా వైసీపీ కార్యకర్తలే. చంద్రబాబు నాయుడు దయవల్ల వారందరితో కలిసి ఎక్కువ సమయం గడిపే అవకాశం నాకు లభించింది” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జైలు అంటే భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు, అభిమానులే తన ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.
ఉద్దేశపూర్వకంగానే విడుదల ఆలస్యం.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, అధికారులు ఉద్దేశపూర్వకంగా తన విడుదలను ఆలస్యం చేశారని కాకాణి ఆరోపించారు. “నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం ప్రజలు, అభిమానులు నా కోసం ఎదురుచూశారు, వారి అభిమానం మరువలేనిది” అని పేర్కొన్నారు.
హాస్యాస్పదమైన కేసులు.. తనపై ఆరు సోషల్ మీడియా కేసులు, ఓటుకు మద్యం ఇస్తానని చెప్పినట్లు హాస్యాస్పదమైన లిక్కర్ కేసులు బనాయించారని ఆయన విమర్శించారు. జైల్లో వేసినంత మాత్రాన తన మనోధైర్యం దెబ్బతినలేదని, మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉన్నానని స్పష్టం చేశారు.
పోరాటం ఆగదు.. నెల్లూరు జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తనను ఇన్ని రోజులు జైల్లో ఉంచడం చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన కుమారుడి తప్పులను ఇకపై కూడా కచ్చితంగా ఎత్తిచూపుతానని కాకాణి హెచ్చరించారు.


