క్షతగాత్రులను తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లిన సబ్ కలెక్టర్

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన బాధితులను సకాలంలో ఆస్పత్రికి చేర్చి మానవత్వాన్ని చాటాడు  ఓ యువ ఐఏఎస్ అధికారి. గుంటూరు జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన వేమూరి రామకోటయ్య 5 నెలల గర్భిణి అయిన తన భార్య, మూడేళ్ల కుమార్తెతో కలిసి ఇంటికి బయల్దేరాడు. వీరు బైక్ పై వస్తుండగా గొల్లనపల్లి వద్ద వీరి బైక్ ను మరో బైక్ ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో రామకోటయ్య, వరలక్ష్మీలకు తీవ్రగాయాలు కాగా వారి కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి.

అదే సమయంలో విజయవాడ నుంచి నూజివీడు వెళ్తున్న సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ రోడ్డు పై ఉన్న క్షతగాత్రులను గమనించారు. వెంటనే ఆలస్యం చేయకుండా తన సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. తన కారులోనే గాయపడ్డ వారిని గన్నవరం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మానవత్వం చూపిన కలెక్టర్ ను అంతా అభినందించారు.