గుంటూరు నగరానికి సమీపంలోని తురకపాలెం గ్రామంలో గత ఐదు నెలలుగా అంతుచిక్కని వ్యాధితో 35 మంది మృతి చెందడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యానికి తురకపాలెం మరణ మృదంగమే నిదర్శనమని ఆమె మండిపడ్డారు.
“రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ ఉన్నట్టా లేనట్టా? గత 5 నెలలుగా వరుస మరణాలు సంభవిస్తుంటే వైద్యారోగ్య శాఖ ఈ రాష్ట్రంలో ఉన్నట్లా? లేనట్లా?” అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇప్పటిదాకా 35 మంది ఒకేవిధంగా మృత్యువాత పడితే కారణం కనుక్కొని అరికట్టకపోవడం సిగ్గుచేటని ఆమె కూటమి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అంతుచిక్కని వ్యాధి ఇంకా ఎంతమందిని బలిగొంటుందోనని గ్రామస్థులు భయపడుతుంటే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని షర్మిల అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్న వైఎస్ షర్మిల, తురకపాలెం మృత్యుఘోషపై వెంటనే స్పందించాలని కోరారు. వైద్యారోగ్య శాఖ పరంగా తక్షణం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి మరణాలకు గల కారణాలను తెలుసుకోవాలి. గ్రామంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరికి అన్ని రకాల మెడికల్ టెస్టులు నిర్వహించాలి. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఈ క్యాంపులు కొనసాగించాలి. మరణాలకు కల్తీ నీళ్లు కారణమా? కల్తీ లిక్కర్ కారణమా? గ్రామంలో పారిశుద్ధ్య లోపమా? ఇంకేమైనా కారణం ఉందా? అనేది నిశితంగా అధ్యయనం చేయాలి. సకాలంలో ప్రభుత్వం స్పందించని కారణంగా జరిగిన మరణాలకు బాధ్యత వహించి, మృతుల ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలి. ఆమె చేసిన ప్రధాన డిమాండ్లు.
“ప్రజలు ప్రాణభయంతో విలవిల్లాడుతుంటే మహమ్మారిని అదుపు చేయకపోవడం అత్యంత బాధాకరమని” ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల డిమాండ్లపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. తురకపాలెం ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు, తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


