రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో అతి వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం, కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ వేగం అదుపు తప్పి, అదుపు కోల్పోయి నేరుగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అంతేకాకుండా, టిప్పర్ లారీ బస్సుపై బోల్తా పడి, లారీలోని కంకర లోడు మొత్తం బస్సుపై పడింది. ఈ ఊహించని ప్రమాదంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు కంకర లోడు కింద కూరుకుపోయారు. ఈ ఘటనలో మొత్తం 19 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రయాణికులు, సహాయక చర్యలు: ప్రమాదానికి గురైన బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా, అందులో దాదాపు 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు మరియు గాయపడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లి, తిరిగి హైదరాబాద్‌లోని కళాశాలలకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కంకర లోడు కింద కూరుకుపోయిన వారిని బయటకు తీసేందుకు జేసీబీ సాయంతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్రాఫిక్ అంతరాయం : ఈ ఘోర ప్రమాదం కారణంగా హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చేవెళ్ల- వికారాబాద్ మార్గంలో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, ట్రాఫిక్‌ను దారి మళ్లించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మృతుల వివరాలు:
దస్తగిరి బాబా, బస్సు డ్రైవర్
కల్పన (45), బోరబండ
బచ్చన్ నాగమణి (55), భానూరు
ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్
తారిబాయ్ (45), దన్నారమ్ తండా
గుర్రాల అభిత (21), యాలాల్
గోగుల గుణమ్మ, బోరబండ
షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు
తబస్సుమ్ జహాన్, తాండూరు

