ఉత్తరాంధ్రకు కొత్త లీడర్ వస్తున్నాడు

నిజం, ఉత్తరాంధ్రకు కొత్త లీడరొస్తున్నాడు.

ఆయనే కింజారపు రామ్మోహన్ నాయుడు.

నిన్న పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం మీద జరిగిన చర్చలో శ్రీకాళం ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడిన తీరు గమనించి  ఉంటారు. రాామ్మోహన్ కుర్ర ఎంపి. ఒకటిన్నర దఫా ఎంపి, అయినాసరే, రామ్మోహన్ మాట్లాడిన పద్ధతిలో పరిపక్వత ఉంది. పార్లమెంటులో మాట్లాటడం ఒక కళ. అది మంచి పార్లమెంటేరియన్లకే ఉంటుంది. కళ తెలిసిన వాళ్లే పార్లమెంటులో నెగ్గుకొస్తారు. లేకపోతే, పేరుకు ఐదు సార్లు ఎంపి అయ్యారనో, ఆరు పార్లు ఎంపి అయ్యారనో అనిపించుకుంటారు తప్ప పార్లమెంటేరియన్ గా రాణించలేరు. ఇపుడు మంచి పార్లమెంటేరియన్లు అంతరించి పోతున్న సమయం. ఇలాంటపుడు బాగా మాట్లాడేవాళ్లను పార్లమెంటులో చూడాలనుకుంటున్న వాళ్లందరికి నిన్న రామ్మోహన్ ఉపన్యాసం క్లుప్తంగా అయితేనేం సంతృప్తి నిచ్చింది.  దీనికి రెండు కారణాలు, రామ్మోహన్ హిందీలో మాట్లాడాడు, రెండు ఆయన మాట్లాడుతూ భావ వ్యక్తీకరణ చేసిన తీరు. ఈ విషయంలో ఆయన అనుభవజ్ఞులయిన పార్లమెంటు సభ్యుల్లాగానే కనిపించారు. తండ్రి ఎర్రన్నాయుడు వారసత్వం ఆయనకు బాగా అబ్బినట్లుంది.   హిందీలో హావభావాలు ప్రదర్శిస్తూ మాట్లాడటం తెలిసివాళ్లెవరయినా పార్లమెంటులో నెగ్గుతారు.

దక్షిణాది ఎంపిలు పార్లమెంటులో నెగ్గ లేకపోవడానికి కారణం, వాళ్లకి హిందీ రాకపోవడం. పార్లమెంటులో, ఢిల్లీలో తమ ముద్రవేసినవాళ్లంతా హిందీలో లేదా ఉర్దూలో మాట్లాడిన వాళ్లే. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చివాళ్ల కు ఉర్దు వస్తుంది. పార్లమెంటులో బాగా ప్రసంగాలు చేసే వాళ్లంతా ఎక్కువ మంది తెలంగాణ  వాళ్లే. పివి నరససింహారావు, జి వెంకటస్వామి, జైపాల్ రెడ్డి,కేశవరావు, దత్తాత్రేయ అంతా చక్కగా హిందీ ప్లస్ ఉర్దూ బాషల్లో బాాగా మాట్లాతారు. ఆంధ్రప్రాంతంలో ఇలాంటి పేర్లు కనిపించవు. పాలనాదక్షుడిగా పేరుండి అనేక సార్లు ఎంపి అయిన కోట్ల విజయభాస్కర రెడ్డి లాంటి వారు కూడా పార్లమెంటులో తమ ముద్రవేయలేకపోవడానికి కారణం… వారెవరికి హిందీ రాదు.

తెలుగుదేశం పార్టీకి సంబంధించి పర్వతనేని ఉపేంద్రవంటి వారు హిందీ లో బాగా మాట్లాడే వారు. ఈ తరం తెలుగుదేశం సభ్యుల్లో హిందీలో అనర్ఘళంగా మాట్లాడేవారే లేరు. అందుకే  ఆంధ్రప్రాంతనుంచి ఇటీవలి కాలంలో పేరున్న పార్లమెంటేరియన్లు రాలేదు. అలాంటపుడు, ఆ గ్యాప్ ని, తనకు వచ్చిన అరకొర హిందీలో, ఇంగ్లీషులో లేదా ఈ రెండు కలగలిసిన తెలుగులో ఉతికి ఆరేసిన వాడు కింజారపు ఎర్రన్నాయుడు. ఎర్రన్నాయుడు ఆకారమే కాాదు, వాయిస్ హావభాలు గొప్పగా ఉండేవి. ఆయనలో భాషలేని లోటు హావభావాలు తీర్చేవి. ఇదే ఎర్రన్నాయుడికి ఎనలేని గుర్తింపు తెచ్చింది. భాషలేని లోటును ఆయన ఆమోఘంగా చేతల తీర్చేసేవాడు. ఆ రోజుల్లో ఢిల్లీలో తెలుగుదేశం అంటే ఇద్దరు నాయుళ్లు. ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు ఎర్రన్నాయుడు. తర్వాత మూడో నాయుడు, వెంకయ్యనాయుడు రంగ ప్రవేశం చేశారు.   1996-2004 మధ్య ఢిల్లీని ఏలిన ముగ్గురు నాయుళ్లు వీరే. ఈ ముగ్గురిలో హిందీ మీద పట్టు సంపాదించి పైపైకి వెళ్లినవాడు వెంకయ్యనాయుడు. ఈ మధ్య లో లోక్ సభ స్పీకర్ గా జిఎంసి బాలయోగి వచ్చారు. ఆయన కూడా హిందీ భాష రాని టెన్షన్ ఫీలయ్యే వారు. హిందీ మాాస్టర్ ని కూాడ ా ఏర్పాటు చేసుకుని హిందీనేర్చుకునే ప్రయత్నం చేశారు. నాలుగు ముక్కలు హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉంటే, మన జీవితంమరోలా ఉండేదని ఎర్రన్నాయుడు అనడం నాకు తెలుసు. హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎర్రన్నాయుడు పడిన తపన అంతా ఇంతాకాదు, మరొకసారి ఆవిషయం ముచ్చటించుకుందాం.

ఎర్రన్నాయుడు అసలు సిసలైన ప్రజానాయకుడు. బాధాకరమయిన ఆయన అకాల మరణంతో ఉత్తరాంధ్రలో ప్రజానాయకుడనే తరం అంతరించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా అక్కడ చాలా మంది పెద్ద నాయకులొచ్చారు. వాళ్ల దారి వేరు. ఎర్రన్నాయుడు దారి వేరు. అందుకే చాలా మంది నాయకులు ప్రజానాయకులు కాలేకపోయారు. ఎర్రన్నాయుడిల్లు ఎపుడూ విజిటర్ల తో నిండిపోయి ఉండేది. ఉదయం 7 గంటలనుంచి రాత్రి ఏడుగంటల దాకా 9, Safdarjung Road, New Delhi క్రిక్కిరిసి పోతూ ఉండేది. అపుడొక జోక్ ఉండేది. ఢిల్లీలో ఎక్కువ మంది విజిటర్లు వచ్చేది, ప్రధాని ఇంటికి కాదు,ఒకటి ఎర్రన్నాయుడు ఇంటికి, రెండు బిజెపి మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటికి.  శ్రీకాకుళం లో ఉంటే పార్టీ కార్యాలయం దగ్గర బారులు తీరి విజిటర్లు ఉండేవారు. వాళ్లకోసం ఫోన్లు చేయడం, ఉత్తరాలీయడం, ఫాలో అఫ్ చేయడం… ఇలా సాగేది ఆయన రోజు వారి జీవితం. వందల వేల సిఫార్సుఉత్తరాలుసాధారణ ప్రజలకు వెళ్లేవి. పనులవతున్నాయా  అని అడిగితే,  వాజ్ పేయి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, ఎర్రన్నాయుడు పేరు చెబితే పని చేయని మంత్రి ఉంటాడా అని తన దైన శైలిలో సుడిగాలిగా నవ్వేవాడు. నిజం, ప్రధానితో అప్పాయంట్ మెంట్ కావాలని ఆయన ఫోన్ చేస్తే, ప్రధాని వాజ్ పేయి నేరుగా లైన్లోకి వచ్చి పదినిమిషాలు మాట్లాడిన సందర్భాలున్నాయి.

ఇలాంటి రాజకీయ సందడిలో రామ్మోహన్  పెరిగాడు.  ఎంపిలెవరూ సంసారాలు ఢిల్లీ పెట్టరు. ఒక్క ఎర్రన్నాయుడు  మాత్రం ఢిల్లీలో ఫామిలి పెట్టాడు. ఢిల్లీలో ఆరోజుల్లో మోస్టు రికగ్నైజబుల్ పర్సనాలిటీలలో ఆయనొకరు. ఆందువల్ల రామ్మోహన్ అక్కడే చదువుకుని ఢిల్లీ కుర్రవాడయిపోయాాడు. హిందీ వచ్చేసింది. అంతే, అదిపుడు ఇలా ఉపయోగపడింది.

నిన్నటి అవిశ్వాసం చర్చలో పెద్ద వాళ్ల ఉపన్యాసాల్లో రామ్మోహన్ ప్రసంగం కనిపించకుండా పోయింది. పత్రికల్లో కూడా  అంత ప్రముఖంగా రాలేదు. సోషల్ మీడియా కొద్ది గా గుర్తింపు నిచ్చింది. ఇపుడు దక్షిణ భారతదేశంలో నుంచి పార్లమెంటుకు వచ్చి హిందీలో మాట్లాడగలిగే వారు చాలా తక్కువ. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే బాగా మాట్లాడతారు.  రామ్మోహన్ దక్షిణాది ఎంపిలలో చక్కటి నార్త్ ఇండియన్ హిందీ మాట్లాడగలిగే నలుగరైదుగురిలో  రామ్మోహన్ ఒకడయ్యాడు…అని ధైర్యంగా  చెప్పవచ్చు. అందుకే రామ్మోహన్ ఢిల్లీ పార్లమెంటులో రాణిస్తాడు. ఉత్తరాంధ్రలో కొత్తజాతీయ నాయకుడవుతాడు…