US Visa: వీసా విషయంలో మరింత అమెరికా రూల్స్.. సోషల్ మీడియాలో జాగ్రత్త!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన తరువాత, వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా వీసా, గ్రీన్‌కార్డ్ మంజూరులో ఆయన ప్రభుత్వం కొత్త కఠిన నిబంధనలతో ముందుకొస్తోంది. తాజాగా అమెరికా ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో ఆందోళన రేపుతోంది. ఇకపై జాతి వ్యతిరేక, ఉగ్రవాద మద్దతు పోస్ట్‌లను సోషల్ మీడియాలో పెట్టినవారికి వీసా ఇవ్వబోమని స్పష్టం చేసింది.

యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకారం, విద్యార్థి వీసా దరఖాస్తుదారులు, ఉద్యోగ వీసాలు, గ్రీన్‌కార్డ్ కోసం అప్లై చేస్తున్నవారి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఇలాంటి పరిశీలనలో, యూదు వ్యతిరేక హింసను ప్రోత్సహించే, ఉగ్రవాద సంఘాల పట్ల మద్దతు తెలిపే పోస్టులు కనిపిస్తే వెంటనే వీసా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

ఇటీవల హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నొయెమ్ మాట్లాడుతూ, “ఈ దేశానికి వచ్చే వారు అమెరికన్ విలువలను గౌరవించాలి. హమాస్, హెజ్‌బొల్లా, హూతీ వంటి ఉగ్రసంస్థలకు మద్దతు తెలపడం, లేదా వాటిని సమర్థించడం సహించబోము” అని స్పష్టం చేశారు. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవలే 300 మందికి పైగా దరఖాస్తుదారుల వీసాలు రద్దు చేశారు.

ఇకపై అమెరికా పౌరత్వం లేదా వీసా కోసం అభ్యర్థించే వారిని కేవలం వారి షెడ్యూల్ డాక్యుమెంట్ల ఆధారంగా కాకుండా, వారి ఆన్‌లైన్ ప్రవర్తన ఆధారంగానూ పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే విషయాలు, లైక్ చేయడం, షేర్ చేయడం వంటి ప్రతీ చర్యపై నిఘా ఉంటుంది. విదేశాల్లో జీవించాలని కోరుకునే వారు ఇకపై సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న పొరపాటు కూడా వారికి అమెరికా వీసా గేట్‌ను మూసేసే ప్రమాదం ఉంది. అందుకే యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకునేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి.