Sai Abhyankkar: ఎంట్రీనే స్టార్ స్టెప్‌తో.. ఎవరీ సాయి అభ్యంకర్?

ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ చాలు అని చాలామంది చెబుతుంటారు. కానీ ఆ ఒక్క ఛాన్స్ అల్లు అర్జున్–అట్లీ లాంటి మాస్ కాంబో సినిమాతో వస్తే? అదే జరుగుతోంది 20 ఏళ్ల యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌కు. ఇప్పటివరకు ఒక్క సినిమాకైనా పూర్తి మ్యూజిక్ ఇవ్వలేదు కానీ, అతడిని AA22 సినిమాకు ఎంపిక చేశారంటే మాటలు కాదు.

సాయి అభ్యంకర్‌ బ్యాగ్రౌండ్ చూస్తే సంగీతమే శ్వాస అన్నట్టు ఉంటుంది. తండ్రి టిప్పు మాస్ హిట్ సాంగ్స్ పాడిన ప్లేబ్యాక్ సింగర్. తల్లి హరిణి.. దశాబ్దాలుగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో పని చేసిన గాయని. వారసత్వంగా వచ్చిన సంగీత పిచ్చితో సాయి అద్భుతమైన మ్యూజిక్ సింగిల్స్ కంపోజ్ చేశాడు. 200 మిలియన్ వ్యూస్ దాటిన “కట్చి సేరి,” “ఆశ” లాంటి సాంగ్స్‌తో యూట్యూబ్‌లో సెన్సేషన్ అయ్యాడు.

అనిరుధ్ రవిచందర్ దగ్గర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవం, అతడి టెక్నికల్ గ్రిప్‌ను పెంచింది. దేవర, కూలీ వంటి చిత్రాలకు బీజీఎంల్లో వర్క్ చేసిన ఇతడు ఇప్పుడు భారీ బడ్జెట్ AA22లో మ్యూజిక్ అందించనున్నాడు. అల్లు అర్జున్, అట్లీ కాంబో ప్రాజెక్ట్‌లో అవకాశం రావడమే కాదు, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో లారెన్స్ హీరోగా నటిస్తున్న ‘బెంజ్’కు కూడా ఈ యువకుడే మ్యూజిక్ డైరెక్టర్.

ఇంకా సూర్య, ఆర్జే బాలాజీ, ప్రదీప్ రంగనాథన్ సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. ఒక్క సినిమాకూ ఫుల్ ఆల్బమ్ ఇవ్వకముందే ఈ స్థాయిలో అవకాశాలు రావడం ఎంతో అరుదైన విషయం. ఇప్పుడు టాలెంట్‌తోనూ, బ్యాక్‌గ్రౌండ్‌తోనూ వచ్చిన ఈ యువకుడు టాలీవుడ్‌ను ఎలా ఊపేస్తాడో చూడాల్సిందే.