MS Dhoni: CSK కెప్టెన్సీలో ఊహించని ట్విస్ట్.. మళ్ళీ ధోని ఎందుకొచ్చాడంటే..

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ చేతికి గాయమవడంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బాల్ ఎల్బోకు తాకడంతో అతనికి హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో, మరోసారి ధోనిని కెప్టెన్‌గా నియమించడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. సీఎస్‌కేకు ఐదు టైటిళ్లు అందించిన నాయకుడే మళ్లీ పగ్గాలు అందుకోవడం అంటే, జట్టులో కొత్త ఉత్సాహం నింపేలా ఉంది.

ఈసారి ధోని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌ ద్వారా మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐపీఎల్ 2025లో చెన్నై ప్రదర్శన అంతగా రాణించలేకపోయింది. ఇప్పటివరకు ఐదు మ్యాచుల్లో నాలుగుసార్లు ఓటమి చవిచూసి, తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. అటువంటి సమయంలో ధోని నాయకత్వం మళ్లీ జట్టును గెలిచే దిశగా తీసుకెళ్లగలడని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇక గత మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌ పద్ధతి అభిమానులకు నిజంగా ఆనందం కలిగించింది. కేవలం 12 బంతుల్లో 27 పరుగులు చేస్తూ, మ్యాచ్‌లో చివరి వరకు పోరాడాడు. అయితే చివరి ఓవర్‌లో అవుట్ కావడంతో జట్టు ఓటమి చవిచూసింది. అయినా, ధోనిలోని ఆత్మవిశ్వాసం, చూస్తే, ఇంకా అతను మ్యాచ్ గేమ్‌ ఛేంజర్ అని స్పష్టమవుతోంది. మాజీ క్రికెటర్లు కూడా ధోనిని టాప్ ఆర్డర్‌లో పంపాలని సూచిస్తున్నారు. 4వ లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే, మ్యాచ్లపై ప్రభావం చూపగలడు అని విశ్లేషణలు సాగుతున్నాయి.

ఈ సమయంలో ధోని మళ్లీ కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించే అవకాశం కీలకమవుతోంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆశలు మెరుగవ్వాలంటే ఈ నిర్ణయం బెస్ట్ స్ట్రాటజీ కావచ్చు. మహీ మళ్లీ ఆ మాజిక్‌ను రిపీట్ చేస్తాడా? అంటే అభిమానులు మాత్రం పూర్తి నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. మైదానంలో మళ్లీ కెప్టెన్ ధోనిని చూసే కిక్కే ఇప్పుడు టీమ్‌కి ఫుల్ ఎనర్జీ ఇస్తోంది.