వీడియో: అనుకోకుండా గాలిలోకి ఎగిరిన బెలూన్.. 100 అడుగుల నుంచి పడిపోయిన వ్యక్తి

రాజస్థాన్‌లోని బారన్ జిల్లాలో జయంతి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. బారన్ జిల్లా ఫౌండేషన్ డే సందర్భంగా నిర్వహించే వేడుకల కోసం హాట్ ఎయిర్ బెలూన్‌ను పరీక్షించుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. టెస్ట్ కోసం సిద్ధం చేసిన బెలూన్ అనుకోకుండా గాలిలోకి ఎగిరింది. అయితే దానికి కట్టి ఉన్న తాడుకు ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. బెలూన్ గాలిలోకి లేచిన కొద్దిసేపటికే సుమారు వంద అడుగుల ఎత్తులో తాడు తెగిపోవడంతో, ఆ వ్యక్తి కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో బెలూన్ గాలిలోకి ఎగిరిపోతుండగా, తాడుకు వేలాడుతున్న వ్యక్తి కనిపించడం, అనంతరం ఆయన కిందపడిపోవడం స్పష్టంగా కనబడుతోంది. వెంటనే స్పందించిన అధికారులు బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించారు.

ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని కోటా ప్రాంతానికి చెందిన వాసుదేవ్ ఖాత్రిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో బారన్ జిల్లా యంత్రాంగం మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఫౌండేషన్ వేడుకలను రద్దు చేసింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, బెలూన్ నిర్వహణలో ఎవరి నిర్లక్ష్యం కారణమైందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అంతేగాక, ఇలాంటి కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలన్న వాదనలు ఊపందుకున్నాయి.