YS Jagan: జగన్ పై మళ్ళీ ఊహించని ఒత్తిడి.. ఓ వైపు మాటల తూటాలు.. మరోవైపు న్యాయపరమైన దెబ్బలు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అధికార కూటమి ఒకవైపు రాజకీయంగా, మరోవైపు న్యాయపరంగా పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూటమి నేతలు జగన్ చేసిన వ్యాఖ్యలనే ఆయుధాలుగా మలుచుకుని, ఆయనపై ఒత్తిడి పెంచుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పోలీసులు, న్యాయవ్యవస్థపై ఆయన వేసే ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే విరుగుడిగా మారుతున్నాయి.

ఇటీవల గన్నవరం ఘటనను గుర్తుచేసుకుంటే, వంశీ అరెస్టుపై జగన్ చేసిన “పోలీసుల బట్టలూడదీసి నిలబెడతా” అనే కామెంట్ తీవ్ర దుమారాన్ని రేపింది. అప్పట్లో పోలీస్ అధికారి సంఘం నిరసనతో ఆగిపోతే, తాజాగా రాప్తాడు పర్యటనలో అదే మాట మళ్లీ రావడంతో పోలీసులు ఈసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఓ మాజీ సీఎంగా జగన్ చేసే వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థను కిమ్చపరిచేలా ఉన్నాయనే అభ్యంతరం వ్యక్తమైంది.

ఇంతలోనే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. జగన్ ఓ బెయిల్ పై ఉన్న నిందితుడన్న విషయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి వ్యక్తి పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు చేస్తే కేసుల్లోని సాక్షులు ఎలా స్పందిస్తారో, దర్యాప్తులు ఎలా సాగుతాయో అనుమానం వ్యక్తం చేశారు. జగన్‌ను నియంత్రించకపోతే పరిస్థితులు ప్రమాదకరమవుతాయని ఆయన హెచ్చరించారు. మొత్తానికి.. జగన్ చేసిన మాటలే ఇప్పుడు ఆయన్నే సంకటంలో నెట్టేస్తున్నాయన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వెల్లివిరుస్తున్నాయి.