తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన స్పష్టమైన మాటలతో చర్చనీయాంశంగా మారారు. ముఖ్యమంత్రులకు ప్రత్యేకమైన గుర్తింపు బ్రాండ్స్ ఉంటాయని చెబుతూ, తనకు సంబంధించిన బ్రాండ్ ఏమిటో కూడా వెల్లడించారు. “రెండు రూపాయల బియ్యం అంటే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు, ఐటీ అంటే చంద్రబాబు, జలయజ్ఞం అంటే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. కొందరు ఉద్యమం పేరు చెప్పుకుంటారు. కానీ నా బ్రాండ్ ఏంటంటే… ‘యంగ్ ఇండియా’, ఇదే నా బ్రాండ్” అని చెప్పారు.
ఈ సందర్భంగా దేశంలోని విద్యా వ్యవస్థపై రేవంత్ తీవ్రంగా విమర్శలు చేశారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నా ఒలింపిక్స్‌లో చాలా తక్కువ పతకాలు మాత్రమే రావడాన్ని ప్రశ్నించారు. చిన్న దేశాలు కూడా మెడల్స్ కొల్లగొడుతున్నారని, ఇది భారత విద్యా మరియు క్రీడా రంగాలపై అసంతృప్తి కలిగించే అంశమని అన్నారు. ప్రతి ఏడాది లక్షల మంది బీటెక్ చేస్తుంటే, వారిలో ఎంతమందికి నాణ్యమైన విద్య అందుతోందని ప్రశ్నించారు.
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు’ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో స్కూల్‌ను 25 ఎకరాల స్థలంలో రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే చిన్నారుల కోసం ప్రీ స్కూళ్లను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి క్రీడల్లో పాల్గొన్న సీఎం రేవంత్ ఎంతో ఉత్సాహంగా కనిపించడమే కాక, వారిలో జోరుగా కలిసిపోయారు. ‘యంగ్ ఇండియా’ అనే తమ ఆలోచనకు జీవం పోసేలా విద్యా రంగంపై దృష్టి పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
