Tahawur Rana : 2008 నవంబర్‌లో ముంబైను ఉలిక్కిపడేలా చేసిన 26/11 దాడుల ప్రధాన సూత్రధారి తహావుర్ రాణా చివరకు భారత దేశానికి అప్పగింపునకు గురయ్యాడు. అమెరికాలో 14 సంవత్సరాలుగా తలదాచుకుని ఉన్న రాణాను న్యాయ ప్రక్రియల తర్వాత అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న రాణాను పోలీస్, ఎన్‌ఐఏ అధికారులు గట్టి భద్రత నడుమ తీసుకురాగా, దీనిపై దేశవ్యాప్తంగా సవినయ ఉద్వేగాలు వ్యక్తమవుతున్నాయి.
అత్యంత రహస్యంగా జరిగిన ఈ ఆపరేషన్‌లో భారత నిఘా సంస్థలు, ఎన్‌ఐఏ అధికారులు కలిసి పని చేశారు. ఢిల్లీ పాలం ఎయిర్ బేస్‌లో విమానం దిగగానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సాయుధ భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. వెంటనే రాణాను ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ ఇప్పటికే హైసెక్యూరిటీ విచారణ గదిని సిద్ధం చేశారు. రాణాను తీహార్ జైలులో ఉంచే అవకాశం ఉన్నా, విచారణ పూర్తయ్యే వరకు ఎన్‌ఐఏ కస్టడీలోనే ఉంచే అవకాశాలు ఉన్నాయి.
తహావుర్ రాణా, 26/11 దాడులలో ప్రధాన పాత్రధారుల్లో ఒకడిగా, దావిద్ హెడ్లీకి భారతదేశం మీద రీకీ చేయడానికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంబైలో కార్యాలయం స్థాపించి, టెరరిస్ట్ ప్లానింగ్‌కు సహకరించినట్లుగా ఎన్‌ఐఏ 2011లోనే చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అమెరికా కోర్టుల్లో రాణా కొన్ని కేసుల్లో దోషిగా తేలిపోవడంతో జైలు శిక్ష అనుభవించాడు.
అయితే 26/11 కేసుకు సంబంధించి భారత్‌కు అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని తాజాగా అమెరికా న్యాయవ్యవస్థ ఆమోదించడంతో రాణా భారత భూమిపై అడుగుపెట్టాడు. ఇప్పుడు రాణా విచారణలో పాక్ ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా ముఠాలకు చెందిన మరిన్ని కీలక సంగతులు వెలుగు చూడబోతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది భారత్‌కు దౌత్యపరంగా, భద్రతాపరంగా కీలక మలుపు కానుంది.