విద్యుత్ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు

తెలంగాణ విద్యుత్  ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ప్రగతి భవన్ లో శనివారం సీఎం కేసీఆర్ విద్యుత్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పీఆర్ సీ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విద్యుత్ ఉద్యోగులకు హెల్త్ స్కీం వర్తిస్తుందని కేసీఆర్ ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసి మరింత అభివృద్ది సాధించాలని సీఎం అన్నారు. విద్యుత్ ను పొరుగు రాష్ట్రాలకు అమ్ముకునే స్థాయికి ఎదగాలన్నారు. ఇప్పటికే రూ.250 కోట్ల విలువైన విద్యుత్ ను విక్రయించామని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ అనేది కేంద్రం పరిధిలో ఉందన్నారు. వివాదంలో ఉన్న సీపీఎస్ ను కూడా పరిష్కరించే దిశగా చర్చిస్తామని సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్దిలో నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ ఏర్పడితే చీకటి అవుతుందని కొందరు శాపనార్ధాలు పెట్టారని, శాపనార్ధాలు పెట్టిన వారే చీకట్లో కలిసిపోయారన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే బాలారిష్టాలను అధిగమించామన్నారు. కేసులు పరిష్కారం కాగనే మిగతా విద్యుత్ ఉద్యోగులను క్రమబధ్దీకరిస్తామని సీఎం అన్నారు. సీఎం ప్రకటనతో విద్యుత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

అంతకుముందు అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దక్షిణ డిస్కమ్ సీఎండీ జి. రఘుమారెడ్డి పదవీకాలం 2019 మే వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురి పదవీ కాలం పొడిగించడంతోపాటు మరికొంత మంది కొత్త డైరెక్టర్లను నియమించారు.