ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీయార్.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారత్ రాష్ట్ర సమితి పార్టీతో జాతీయ రాజకీయాలు షురూ చేసిన సంగతి తెలిసిందే. ‘దేశ్ కీ నేతా కేసీయార్’ అంటున్నాయి గులాబీ శ్రేణులు.

నిన్ననే ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా నిర్వహించాయి గులాబీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల నుంచీ ఈ బహిరంగ సభకు పెద్దయెత్తున జనాన్ని తీసుకురావడంలో భారత్ రాష్ట్ర సమితి సక్సెస్ అయ్యింది.

కాగా, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 2024 ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి నుంచి కేసీయార్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీయార్ పోటీ చేస్తారు.

లోక్‌సభ ఎన్నికలొచ్చేసరికి మాత్రం కేసీయార్ తొలి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేనంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తే ఎలా వుంటుంది.? అన్న దిశగా కేసీయార్ సమాలోచనలు చేస్తున్నారట.

ఈ ప్రచారంలో నిజమెంతోగానీ, ఒకవేళ కేసీయార్ విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేయాలనుకుంటే మాత్రం, భారత్ రాష్ట్ర సమితికి ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఊపు రావడం ఖాయం. ఈ క్రమంలోనే ఆయన స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావిస్తున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తాలూకు సారాంశం.