సంక్షోభంలో కూరుకుపోతూ ‘ఈనాడు’  – కొత్త ‘బూస్ట్’ డ్రామాలతో రామోజీ

Ramoji Rao new strategies to save Eenadu
తెలుగు మీడీయా ప్రపంచంలో ‘ఈనాడు’ వేసిన ముద్ర సామాన్యమైనది కాదు.  దశాబ్దాలుగా వార్తలను ప్రజలకు చేరవేయడంలో ఈనాడు కృషి ఎంతో గొప్పది.  తెలుగు ప్రజలకు వార్తలంటే ఈనాడు పేపరే అనేంతటి పేరు ఈనాడుకు ఉంది.  ఈనాడు పత్రిక చదవనిదే రోజు మొదలుపెట్టని వారున్నారంటే అతిశయోక్తి కాదు.  కేవలం వార్తలే కాదు వసుంధర, సుఖీభవ, హాయ్ బుజ్జి, విహారి, చదువు, దేవతార్చన లాంటి ఫీచర్లతో అన్ని వయసుల వారికి ఈనాడు పత్రిక దగ్గరైంది.  కొన్ని దశాబ్దాలుగా టాప్ స్థానంలో కొనసాగి, ఏ ఇతర పత్రిక అందుకోలేనంత ఎత్తులో ఉండిన ఈనాడుకు ఇప్పుడు గడ్డు కాలం సంభవించిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.  ఇన్నేళ్ళు అనేక సంక్షోభాలను ఎదుర్కొని నిలబడిన రామోజీరావు ఈసారి మాత్రం రూటు మార్చక తప్పట్లేదట. 
 
 
గడిచిన ఏడాది కాలంలో పత్రిక సర్క్యులేషన్, ఆదాయం బాగా దెబ్బతిన్నాయి.  కరోనా ప్రభావంతో  రోజుకు 15 లక్షలు ఉన్న సర్క్యులేషన్ 9 లక్షలకు పడిపోయిందట.  పైపెచ్చు ఇన్నాళ్లు రాజకీయ, ప్రభుత్వ ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం ఇప్పుడు లేదు.  గతంలో టీడీపీ అధికారంలో ఉండటం, వేరే పార్టీలు ఉన్నా పత్రిక మీద పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో ఆదాయం ఆగలేదు.  కానీ ప్రజెంట్ సిట్యుయేషన్ అలా లేదు.  ఏపీలో రూల్ చేస్తున్న వైసీపీకి సొంత పత్రిక సాక్షి ఉంది.  అలాగే తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రిక తెరాస ప్రభుత్వానికి సన్నిహిత పత్రిక.  ఈ రెండు పత్రికలకే అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయి.  అంతేకాదు వాటి సర్క్యులేషన్ కూడా బాగా పెరిగి ఈనాడుకు గట్టి పోటీగా నిలబడ్డాయి.  
 
 
ఈ పరిస్థితులన్నీ కలిసి పత్రికను నష్టాల్లోకి నెట్టాయి.  పేపర్, మిషనరీ, ప్రింట్, యూనిట్ల నిర్వహణ ఖర్చులు కూడా వెనక్కి రావట్లేదట.  దీంతో యాజమాన్యం పత్రికను మూసివేయాలనే ఆలోచనలో ఉందట.  అయితే మూసివేతకు ముందే కొత్త మార్గాన్ని నిర్మించుకోవాలనేది రామోజీ ఆలోచన.  ఆ కొత్త మార్గమే డిజిటల్ ఫ్లాట్ ఫామ్.  ఇప్పటికే ఈనాడు డాట్ నెట్ పేరుతో న్యూస్ వెబ్ సైట్, ఈనాడు ఈ-పేపర్ లాంటివి నడుపుతున్నారు.  వీటిని మరింత బలోపేతం చేసి పత్రిక పాఠకులందరినీ డిజిటల్ యూజర్లుగా మార్చే ప్రక్రియ జరుగుతోందట.  పత్రిక సర్క్యులేషన్ తగ్గినా డిజిటల్ రీడర్స్ సంఖ్య పెరిగింది.  ప్రజెంట్ ఈనాడు డాట్ నెట్ కు రోజుకు 50 లక్షల మంది రీడర్స్ ఉండొచ్చు.  అదే విధంగా ఈ పేపరుకు అదే స్థాయిలో ఆదరణ తీసుకొచ్చి సబ్ స్క్రిప్షన్, డిజిటల్ ప్రకటనల రూపంలో ఆదాయం ఆర్జించాలని గత మూడు నెలలుగా కసరత్తులు జరుగుతున్నాయి.  
 
 
రామోజీరావు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తే పత్రికను పూర్తిగా ఈ-పేపర్ రూపంలోకి మార్చేసి నష్టాలు, ఒత్తిళ్లు, పోటీ, సంక్షోభం నుండి బయటపడుతూనే మీడీయా రంగంలో ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరును, కొనసాగించిన హవాను కూడా కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది.  మరి కుంగిపోతున్న ఈనాడును రామోజీ అందిస్తున్న కొత్త జవసత్వాలు ఏమేరకు నిలబెడతాయో చూడాలి.