జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఫేక్ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ కలకలం రేపాయి. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా భాటియాల పేర్లు, ఫోటోలు, చిరునామాలతో కూడిన మూడు నకిలీ ఓటర్ కార్డులను చూసి అందరూ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వీటి చక్కర్లు కొట్టడం ఎన్నికల విధానంలో గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా భావిస్తున్నారు.
ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సినీ నటుల పేర్లతో ఓటర్ స్లిప్పులు సర్క్యులేట్ అవుతున్నట్లు తెలిసింది. వెంటనే సంబంధిత ఏఆర్ఓతో విచారణ జరిపినప్పుడు అవి ఫేక్ అని తేలింది. ఫోటోలు మార్ఫ్ చేసి రూపొందించారని గుర్తించాం. వెంటనే మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేశారని తెలిపారు.. ఇలాంటి నకిలీ ప్రచారంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన నకిలీ ఓటర్ కార్డుల్లో ఒకే చిరునామా 8-2-120/110/4 ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) యూసుఫ్‌గూడ సర్కిల్-19 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, 61-జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
ఎన్నికల అధికారులు ప్రజలకు కూడా పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో ఎలాంటి ఫేక్ ఓటర్ కార్డులు, నకిలీ డాక్యుమెంట్స్ సర్క్యులేట్ అవుతున్నా నమ్మవద్దు. అవి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కలత కలిగించే ప్రయత్నాలు మాత్రమే. ఎవరైనా ఈ రకమైన నకిలీ ప్రచారంలో పాలుపంచుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
ఈ ఘటన కొత్తవే కాదు. ఎన్నికల సమయంలో ప్రముఖుల పేర్లను వాడి నకిలీ ఓటర్ కార్డులు సృష్టించడం సామాన్య సమస్యగా మారింది. కానీ ప్రముఖుల పేర్లతో ఈసారి సర్క్యులేట్ అయిన ఫోటోలు, చిరునామాలు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ. నెటిజన్లు, ఫ్యాన్స్, మరియు రాజకీయ విశ్లేషకులు ఈ ఘటనపై వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖుల ఫోటోలు, వ్యక్తిగత వివరాలను నకిలీగా ఉపయోగించడం కేవలం సరదా గేమ్ కాదని.. చట్ట విరుద్ధమని అంటున్నారు.
