Power Cut: ఇదేం పిచ్చిరా బాబూ.. లవర్ ఫోన్ బిజీ వచ్చిందని.. ఊరికి కరెంట్ కట్ చేశాడు..!

ప్రేమలో పడినవాడు పిచ్చి పనులు చేస్తాడంటారు. కానీ ఒక యువకుడు చేసిన పని మాత్రం ప్రజలందరినీ ఇబ్బంది పెట్టింది. తన ప్రియురాలు ఫోన్ బిజీగా ఉందని కోపం తెచ్చుకున్న ఆ యువకుడు.. ఊరి మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు కూడా ఇదెంత పిచ్చి పని బాబోయ్.. అంటూ షాక్ అవుతున్నారు.  అయితే ఇది ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

ఈ ఘటనా వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు తన ప్రియురాలికి పలుమార్లు ఫోన్ చేశాడు. కానీ ఆమె లైన్ బిజీగా ఉండడంతో అతడు ఆగ్రహానికి గురయ్యాడు. మొదట కొద్దిసేపు ఎదురుచూసినా.. ఆ తర్వాత ఆవేశంలో కరెంట్ పోల్ ఎక్కేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తెరతో గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే వైర్లు కత్తిరించాడు. దాంతో మొత్తం ఊరు అంధకారంలో మునిగిపోయింది.

ఊర్లో కరెంట్ పోవడంతో ప్రజలు మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత ఆ యువకుడు చేసిన పని తెలిసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోయారు. ఒక్క అమ్మాయి ఫోన్ బిజీగా ఉందని ఊరి మొత్తాన్ని చీకటిలోకి నెట్టేశావా.. ఇది సరదా కాదు.. ప్రాణాలకు ప్రమాదం కలిగించే పని చేశావు అంటూ మండిపడ్డారు.

ఈ ఘటనపై వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు అతడిపై సెటైర్లు వేస్తున్నారు. ఒకరు అది టెలిఫోన్ లైన్ కాదు బాబూ.. మొబైల్ సిగ్నల్ అని తెలిసి ఉంటే ఈ పిచ్చిపని చేసేవాడివా.. అని కామెంట్ చేయగా, ఇంకొకరు ఇకనైనా సినిమాలు చూసి మాయలో పడక.. నిజ జీవితంలో బుద్ధిగా ఉండు.. అని సలహా ఇచ్చారు. మరికొందరు కరెంట్ పోల్ ఎక్కడం ప్రాణాంతకమైన పని.. షాక్ కొట్టి చనిపోయినా మిగిలేది పశ్చాత్తాపమే” అని హెచ్చరించారు.

గ్రామస్తులు కూడా అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా వదిలేస్తే రేపు ఇంకొకరు ఇలాగే ఏదో చేసి ఊరిని ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి కఠినంగా శిక్షించాలి.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రేమలో ఉన్నప్పటికీ అతి ఆవేశం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది.