Movie Review – ‘ఫలక్ నుమా దాస్’

            సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యువ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఫలక్ నుమా దాస్’ విడుదలైంది. ‘ఈ నగరానికి ఏమైంది’ లో ఒక హీరోగా నటించిన విశ్వక్సేన్ నాయుడు దర్శకుడుగా మారి, టైటిల్ రోల్ కూడా నటిస్తూ ‘ఫలక్ నుమా దాస్’ ని రూపొందించాడు. మలయాళంలో మంచి హిట్టయిన ఇండిపెండెంట్ మూవీ ‘అంగమలి డైరీస్’ ని రీమేక్ చేయడానికి సాహసించాడు. జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందిన ‘అంగమలి డైరీస్’ ని రీమేక్ చేయడం సాధ్యమా? ఆ మాటకొస్తే  ఇండిపెండెంట్ మూవీస్ ని ఎవరైనా రీమేక్ చేసే దుస్సాహసం చేస్తారా? గతంలో చేస్తే ఏమైంది? ఇవి రివ్యూలో చూద్దాం…

కథ 

        దాస్ (విశ్వక్ సేన్) హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఫలక్ నుమా ప్రాంతంలో తల్లితో, చెల్లెలితో వుంటాడు. స్కూల్లో చదువుకుంటున్నప్పట్నుంచీ ఆ ఏరియాలో శంకర్ ని అభిమానిస్తూ రోల్ మోడల్ గా చేసుకుంటాడు. శంకర్ ఫుట్ బాల్ టీంతో విజయాలు సాధిస్తూ, మరోపక్క గ్యాంగ్ తో సెటిల్ మెంట్ దందాలు చేస్తూంటాడు. తాము కూడా అలాటి గ్యాంగ్ ని సృష్టించుకోవాలని స్కూలు పిల్లలతో ఒక గ్యాంగ్ ని తయారు చేసుకుని శంకర్ అభిమానం పొందుతాడు దాస్. పెద్దయి ఆ గ్యాంగులోనే పని చేస్తూంటే,  ఒకరోజు శంకర్ హత్యకి గురవుతాడు. దీంతో శంకర్ మనిషి పాండు (ఉత్తేజ్) దాస్ గ్యాంగ్ కి పెద్ద దిక్కుగా వుంటాడు. ఎదుటి గ్యాంగ్ దగ్గర గొర్రెల్ని కొని మటన్ వ్యాపారం చేస్తూంటే, ఆ గ్యాంగ్ తో తేడాలొచ్చి బాంబు లేసుకుంటారు. దాస్ వేసిన ఒక బాంబుకి ఇంకెవరో చచ్చి హత్యకేసు మీద పడుతుంది. ఈ హత్య కేసులోంచి బయట పడాలంటే 20 లక్షలు కావాలి. ఈ డబ్బు కోసం ఫలక్ నుమా దాస్ గ్యాంగ్ ఏం చేసిందనేదే మిగతా కథ.

ఎలావుంది కథ

        రొటీన్ రౌడీ కొట్లాటల బీ గ్రేడ్ మాస్ మూవీలా వుంది. పైన చెప్పుకున్న అంగమలి డైరీస్ ‘అంగమలి దాస్’ కాదు మాస్ సినిమా టైటిల్ లాగా. మలయాళ దర్శకుడు విన్సెంట్ పీప్ డైరీని తీసుకొచ్చి ‘ఫలక్ నుమా దాస్’ అని టైటిల్ పెట్టినప్పుడే ఈ రిమేక్ క్వాలిటీ ఏమిటో తెలిసి పోయింది. అంగమలి కేరళలో ఒక పట్టణం. దానికో నేటివిటీ, జీవితం వున్నాయి. వీటితో బాటు అక్కడి మనుషుల్ని ఫీలై దర్శకుడు విన్సెంట్ పీప్, రచయిత వినోద్ జోస్ లు కలిసి వాళ్ళ పర్సనల్ డైరీలాగా ఒక విలక్షణ కథా ప్రపంచాన్ని సృష్టించారు. ఇలా ఇది వెండి తెరపై వాళ్ళ భావకవిత్వంతో  – ఇండిపెండెంట్ సినిమా లేదా ఇండీ ఫిలింగా అయింది. ఇండీ ఫిలింని తెచ్చుకుని రీమేక్ చేసే వాళ్ళెవరూ వుండరు బహుశా –  తెలుగు జంటిల్ మెన్లు తప్ప. షార్ట్ ఫిలిం ని రీమేక్ చేయడం ఎలాటిదో ఇదీ అంతే. గతంలో (2016) ఆల్ఫోన్స్ పుత్రేన్ తీసిన తమిళ ఇండీ ఫిలిం ని తెలుగులో సందీప్ కిషన్ తో ‘రన్’ అని రిమేక్ చేసి నవ్వుల పాలయ్యారు. అదే పుత్రేన్ మలయాళంలో రిమేక్ చేసి సక్సెస్ అయ్యాడు. ఎవరి ఇండీ ఫిలిం ని వాళ్ళే రీమేక్ చేసి సక్సెస్ అవగలరు. ఇండీ ఫిలిమ్స్ రెగ్యులర్ కమర్షియల్స్ లా వుండవు. అవి దర్శకుడి పర్సనల్ చార్మ్ తో కథగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. తెలుగులో ‘కేరాఫ్ కంచరపాలెం’ కూడా ఇలాటిదే. కంచరపాలెం నేటివిటీతో, అక్కడి మనుషుల కథతో వున్న ‘కేరాఫ్ కంచరపాలెం’ ని తీసికెళ్ళి మలయాళం లో ‘కేరాఫ్ శెట్టిపాలెం’ అని తీస్తే ఎలా వుంటుందో, ‘అంగమలి డైరీస్’ ని తెచ్చుకుని పేజీలకి పేజీలు  ‘ఫలక్ నుమా దాస్’ గా తీస్తే అలాగే వుంటుంది.

ఎవరెలా చేశారు 


        నటన దర్శకత్వం బాధ్యతలు మీదేసుకున్న విశ్వక్సేన్ ఏం చేసీ కూడా ఒక ఇండీ మూవీని రిమేక్ చేసి సక్సెస్ అవడం సాధ్యం. అంగమలి నేటివిటీ దృశ్యాలు సున్నితంగా, సునిశితత్వం తో కన్పిస్తాయి. ఆ మేకింగ్ లో వున్న జీవమే వేరు. అందుకే జాతీయ, అంతర్జాతీయ్ మన్ననలు పొందింది. ఫలక్ నుమాతో ఇవి మిస్సయి మొరటుగా తయారయ్యాయి. సరే, మలయాళంని కాసేపు పక్కన బెట్టి,  దీన్ని దీని లాగే చూసినా ఒక రీజనబుల్ మాస్ సినిమా లక్షణాలని కలిగిలేదు. పైగా బీ గ్రేడ్ స్థాయితో వుంది. విశ్వక్సేన్ నటించాడు గానీ ముద్ర వేయలేకపోయాడు. విశ్వక్సేన్ చేసిన మేలు ఉత్తేజ్ కి, ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ కీ చెప్పుకోదగ్గ పాత్రలివ్వడం. గ్యాంగ్ పెద్ద దిక్కుగా ఉత్తేజ్, ఎస్సైగా తరుణ్ భాస్కర్ లున్న దృశ్యాలే బావున్నాయి. ఆశ్చర్యకరంగా తరుణ్భాస్కర్ తను రియలిస్టిక్ గ నటించగలనని నిరూపించుకున్నాడు. 

        ఇక హీరోయిన్లు ముగ్గురున్నారు. సలోనీ మిశ్రా, హర్షితా గౌర్, ప్రశాంతీ చారులింగా… అయితే ముగ్గురితో కూడా రోమాన్స్ పొడి పొడి గానే వుంటుంది. డాక్టర్ జోయా అనే ముస్లిం పాత్రలో సలోనీ మిశ్రాకి హీరోని పెళ్లి చేసుకునే పాత్ర దక్కింది. ఇక ముఠాల్లో కొత్త నటులు చాలా మందే వున్నారు. ఏ సీన్లో చూసినా క్రౌడ్ గా వుంటారు. బూతులు తిట్టుకోవడం, బాటిల్స్ తాగడం, బరితెగించి కొట్టు కోవడం.

        సంగీతం రెగ్యులర్ యాక్షన్ నినిమా సంగీతంలా వుంది తప్ప,  హైదరాబాద్ ఫీల్ లేదు. కెమెరా వర్క్ లోనూ ఇంతే. ఫీల్ తీసుకురావాలంటే ఇక్కడి గంగా – జమున తెహజీబ్ తెలిసి వుండాలి.

చివరికేమిటి 

        డైరెక్ట్ బూతులు, రఫ్ ప్రవర్తనలు, హింస – సహజత్వం కింద చెలామణి అయిపోతాయనుకుంటే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. కథగా చూస్తే ఇండీ ఫిలిమ్స్ కథలు వేరు, రెగ్యులర్ కమర్షియల్ కథలు వేరు. తెలుగు ప్రేక్షకులకి మొదటి దానితో సంబంధ బాంధవ్యాలు లేవు. అందుకని ఈ కథ ఎక్కడం కష్టమే. ఒక హత్య, అందులోంచి బయట పడడానికి ఇరవై లక్షలు. ఇలాటి చిన్న చిన్న కథలు కమర్షియల్ సినిమాలకి ఆనవు. మలయాళ ప్రేక్షకులు వేరు, వాళ్ళ టేస్టు వేరు. ముఠాల దాడులు ఎదురు దాడులతో ఫస్టాఫ్ ఎలాగో కూర్చొబెట్టినా – కథా ప్రారంభం కోసం ఇంటర్వెల్ వరకూ తీసుకున్నా, సెకండాఫ్ లో హత్యలో ఇరుక్కున్న హీరోతో మరీ అర్ధం పర్ధం లేకుండా తయారయ్యింది. పైగా హీరోతో ఏ ఎమోషనూ వుండదు. కొన్ని చోట్ల డైలాగులు నవ్విస్తాయి, అంతవరకే. ఒరిజినల్ తో పోల్చకుండా చూడాలన్నా, మాస్ కి కూడా ఇంత మాస్, ఏ కొత్తదనమూ లేని ఇలాటి  అవసరం లేదేమో అన్పిస్తుంది.

దర్శకత్వం: విశ్వక్ సేన్
తారాగణం :  విశ్వక్ సేన్, సలోనీ మిశ్రా, హర్షితా గౌర్, ప్రశాంతీ చారులింగా, తరుణ్ భాస్కర్, ఉత్తేజ్, అభినవ్ 
సంగీతం: వివేక్ సాగర్, ఛాయాగ్రహణం : విద్యా సాగర్ 
బ్యానర్స్ : వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్సర్స్, మీడియా9 క్రియేటివ్ వర్క్స్ 
నిర్మాతలు : కరాటె రాజు, సందీప్, మనోజ్ 
విడుదల : మే 31, 2019 
1.25 / 5

‘ఫలక్ నుమా దాస్’ – డైరీస్ మిస్!

<

p style=”font-weight: 400;”>సికిందర్