కాంగ్రెస్ జగ్గారెడ్డి కారులో 2 కోట్లు, జూబ్లీహిల్స్ లో కలకలం

జూబ్లీహిల్స్ లో మంగళవారం రాత్రి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఓ కారులో తరలిస్తున్న 2.11 కోట్ల రూపాయలను పోలీసులు గుర్తించారు. వీటికి సంబంధించిన లెక్కలు చూపనందున పోలీసులు వాటిని స్వాధీన పరుచుకున్నారు. అయితే ఆ కారులో దొరికిన డబ్బు కాంగ్రెస్ నేత, సంగారెడ్డి అభ్యర్ది జగ్గారెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.

జగ్గారెడ్డి అనుచరుడు కిరణ్, మరో ఇద్దరు వ్యక్తులు కారులో డబ్బు తరలిస్తున్నారు. కారులో భారీ మొత్తంలో డబ్బు తరలిస్తన్నట్టగా పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆ కారును రోడ్ నంబర్ 35 లో పట్టుకున్నారు. ఆ కారును తనిఖీ చేయగా అందులో 2.11 కోట్ల రూపాయలు దొరికాయి. మద్యం సీసాల కింద డబ్బులను పెట్టి తీసుకెళుతున్నారు. పోలీసులు కారులో ఉన్న వారిని ప్రశ్నించగా వారు సరైన సమాధానం చెప్పలేదు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వారిని విచారించగా అవి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కి చెందిన పైసలుగా వారు తెలిపారు. భారీ స్థాయిలో డబ్బు పట్టు బడడంతో చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో పంచేందుకే తీసుకెళుతన్నారని తెలుస్తోంది. జగ్గా రెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా మహాకూటమి మద్దతుతో బరిలో నిలిచారు. జగ్గారెడ్డి డబ్బు అని నిర్దారణ కావడంతో జగ్గారెడ్డి మరీ ఈ విషయం పై ఏం చెబుతారని చర్చ జరుగుతోంది.