గులాబీ పార్టీ సిక్స్‌టీ ప్లస్సూ.! కాంగ్రెస్ ఆశలు ఆవిరేనా.?

అదేంటీ, గులాబీ పార్టీ అడ్రస్ గల్లంతయిపోనుందంటూ ఓ బలమైన వాదన తెలంగాణలో వినిపిస్తోంటే, ఆ గులాబీ పార్టీనే 60కి పైగా స్థానాల్లో గెలుస్తుందంటూ కొత్త ప్రచారం ఎలా తెరపైకొచ్చిందబ్బా.? ఔనట, గులాబీ పార్టీకి 60 నుంచి 65 సీట్ల వరకు రావొచ్చునట. ఇది ఓ తాజా సర్వే.

భారత్ రాష్ట్ర సమితి లెక్క 60 నుంచి 65 కాగా, భారతీయ జనతా పార్టీ లెక్క 10 నుంచి 12 అట. ఇందులో జనసేన వాటా కూడా వుంటుందట. మిగిలిన సీట్లలో కాంగ్రెస్ పార్టీ 30 వరకు సర్దుకోవచ్చంటున్నారు. మజ్లిస్ పార్టీ లెక్క ఎలాగూ పక్కాగానే వుంటుంది.. అది వేరే సంగతి.

అసలు ఈ సర్వే ఎవరు చేశారు.? దీని కథేంటి.? అంటే, తెలంగాణలో నిత్యం సర్వేలు జరుగుతూనే వున్నాయి. ఆయా మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు అధికారికంగా, అనధికారికంగా ఈ సర్వేలను నిర్వహిస్తున్నాయి. అధికారిక సర్వేల్లో లెక్కలకీ, అనధికారిక సర్వేల లెక్కలకీ చాలా తేడా వుంటోంది.

తాజాగా మనం చూస్తున్న ఈ సర్వేని, అనధికారిక సర్వే అని చెప్పుకోవచ్చు. రెండు మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయట. ఓ రాజకీయ పార్టీకి అత్యంత సన్నిహితంగా వుండే ఓ ప్రముఖుడు (బీఆర్ఎస్ కాదు) ఈ సర్వే చేయించినట్లుగా చెబుతున్నారు.

‘నేనే ముఖ్యమంత్రిని..’ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పుకుంటోంటే, ‘ముందైతే నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి కదా.?’ అంటూ కాంగ్రెస్ నేతలే, ఆయన్ని కిందికి లాగేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కాంగ్రెస్ దెబ్బ తినడానికి కారణమని అంటున్నారు.

వాస్తవానికి, రోజుకోరకంగా తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్ మారిపోతోంది. నిన్నటి అంచనాలకీ, నేటి వాస్తవ పరిస్థితులకీ చాలా తేడా వుంటోంది. రేపు ఈక్వేషన్ మరింత ఆశ్చర్యంగా మారుతోంది. అయితే, ఇక్కడ మనం పేర్కొంటోన్న ఈ లెక్కలో పెద్దగా మార్పులు వుండకపోవచ్చునట. అంత పక్కాగా సర్వే చేశారట.