కేటీయార్‌కే డౌటొచ్చిందా.? కేసీయార్‌ది మేకపోతు గాంభీర్యమేనా.?

ముచ్చటగా మూడోసారి.. కేసీయారే ముఖ్యమంత్రి.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయకముందు తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించిన వాదన ఇది. కానీ, ఎప్పుడైతే అందరికంటే ముందే కేసీయార్, బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించారో.. అప్పటినుంచి కథ మారిపోయింది.

పార్టీలో టిక్కెట్లు దక్కనివారి లొల్లి. టిక్కెట్లు దక్కించుకుని మరీ, పార్టీ మారినవారి పంచాయితీ.. వెరసి, కేసీయార్ ఇమేజ్ పడిపోతూ వచ్చింది. లేకపోతే, కేసీయార్‌ని కాదని తెలంగాణలో రాజకీయం చేయడం అంత తేలిక కాదు ఎవరికైనా.. ఇలా వుండేది తెలంగాణలో చాలామంది రాజకీయ నాయకుల తీరు.

బీఆర్ఎస్‌కి ధీటుగా బీజేపీ నిలబడుతుందనుకుంటే, అనూహ్యంగా బీజేపీ నీరుగారిపోయింది. బీజేపీ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపుగా వెళ్ళిపోయారు. ఎక్కువమంది కాంగ్రెస్ పార్టీలోకే దూకేసిన సంగతి తెలిసిందే. దాంతో, కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది.

కాంగ్రెస్‌లో అంతర్గత తగాదాలు ఎలా వున్నా, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అధికార పార్టీకి వుండే అడ్వాంటేజ్ నేపథ్యంలో గులాబీ పార్టీ హంగామా మామూలే. అయితే, గులాబీ పార్టీ సభలకు జనం వెళుతున్నా, గ్రౌండ్ లెవల్‌లో ఆ పార్టీకి విపరీతమైన నెగెటివిటీ ఎదురవుతోంది.

ఇదిలా వుంటే, కేటీయార్ పేరుతో కొన్ని ఆడియో టేపులు.. సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. గాలి వార్తల సంగతి సరే సరి. కేటీయార్ ఓడిపోతారన్నది ఆ తరహా టేపులు, గాలి వార్తల సారాంశం. తనయుడి ఓటమితోపాటు తానూ ఓటమి పాలవుతాననే భయంతో కేసీయార్ వున్నారన్నది మరో ప్రచారం.!

ఎందుకిలా.? కేసీయార్ అలాగే కేటీయార్.. ఇద్దరూ ఓడిపోతే తెలంగాణలో రాజకీయాలు ఎలా మారిపోతాయ్.? మారతాయ్.. అనూహ్యంగా మారిపోతాయ్.!