తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ సినిమాల కోసం కథ సిద్థమైంది. ఆర్టిస్ట్‌ల ఎంపిక పూర్తి కాగానే సినిమాకు సంబంధించి అప్‌డేట్ వస్తుంది‘ అని అన్నారు నిర్మాత కె.కె.రాధా మోహన్. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆయన హిందీలో చేసిన తొలి చిత్రం ‘రుస్లాన్’. ఆయుష్‌శర్మ కథానాయకుడు. సుశ్రీ మిశ్రా కథానాయిక. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్.బి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోందీ సినిమా.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రచయిత విజయేందప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఈ సినిమా టీజర్‌ని చాలాసార్లు చూశా. చూసిన ప్రతిసారీ కొత్త కోణం కనిపిస్తోంది. సల్మాన్‌ఖాన్‌తో సినిమా జరుగుతున్నప్పుడు సెట్లో ఆయుష్‌ని చూశా. దర్శకత్వ శాఖలో పనిచేసేవారు. అప్పుడే ఓ హీరోలా కనిపించాడు. ఇందులో బాగా నటించాడు. రాధా మోహన్ తపన ఉన్న నిర్మాత. ఈ సినిమాని అద్భుతంగా నిర్మించారు. జగపతిబాబు ఇందులో కనిపించిన విధానం మరింత ప్రత్యేకం‘ అన్నారు.
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ‘భావోద్వేగాలు, యాక్షన్, చక్కని సంభాషణలు, అందమైన విజువల్స్ గొప్ప అనుభూతిని పంచేలా చిత్రాన్ని తీశాం. హిందీలో నా రెండో చిత్రం కోసం రచయిత విజయేందప్రసాద్ కథ సిద్థం చేశారు. అది తెలుగులో ‘విక్రమార్కుడు2’గా, హిందీలో ‘రౌడీరాథోడ్2’గా తెరకెక్కుతుంది. ఆయన సల్మాన్ ఖాన్ కోసం ‘బజరంగి భాయ్‌జాన్2’ కథని కూడా సిద్థం చేసి, సల్మాన్‌ఖాన్‌కి వినిపించేందుకు సిద్థంగా ఉన్నారు‘ అని అన్నారు.