షాకింగ్ న్యూస్ : సిద్ధిపేటలో హరీష్ రావు పై పోలీస్ కేసు

తెలంగాణ  ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్ధిపేట లో పోలీసు కేసు నమోదైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు మీద కేసు నమోదు చేసినట్లు సిద్ధిపేట వన్ టౌన్ సిఐ నందీశ్వర్ వెల్లడించారు. 

హరీష్ రావు అక్టోబరు 30వ తేదీన ఆర్యవైశ్య కుల సంఘం సమావేశంలో పాల్గొన్నారు. హరీష్ రావుకు సన్మానం చేశారు. విరాళాల రూపంలో నిధుల కూడా సేకరించారు. 

ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో మంత్రి హరీష్ రావు మీద కేసులు నమోదు చేయాలని సిఈసి నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని 125 సెక్షన్ ప్రకారం హరీష్ రావు మీద చర్యలు తీసుకోబోతున్నట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర సిఇఓ రజత్ కుమార్ బుధవారమే వెల్లడించారు. ఈ మేరకు హరీష్ రావు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు ఈసి వర్గాల నుంచి సమాచారం అందింది.

ఈ విషయమై ఈసి ఆదేశాల మేరకు పక్కాగా ఆధారాలు సేకరించిన ఎన్నికల సంఘం  సిద్ధిపేట జిల్లా అధికారులు సిద్ధిపేట  వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిఈసి ఆదేశాల మేరకే హరీష్ రావు మీద ఫిర్యాదు చేసినట్లు రిట్నరింగ్ అధికారి తెలిపారు.

రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు హరీష్ రావు మీద ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు అయింది.

హరీష్ రావు మీద  125 ఆర్పీ, ఐపిసి 188 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల కింద నేరం రుజువైతే జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలున్నాయి. హరీష్ రావు మీద శుక్రవారం సాయంత్రం వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

హరీష్ రావు మీద కేసులు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నది. తెలంగాణలో ఇలాంటి కేసులు నమోదైన వ్యక్తిగా హరీష్ రికార్డులోకి ఎక్కారు. ఏ మంత్రి మీద కూడా కేసు నమోదు అయిన దాఖలాలు లేవు. కేసులు నమోదు చేసిన ఈసి అంతటితో ఆగుతుందా? లేదంటే చర్యలకు ఉపక్రమిస్తుందా అన్నది తేలాల్సి ఉంది.

ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 125 ఏం చెబుతున్నదంటే…?

ప్రజాప్రాతినిథ్య చట్టం లోని 125 నిబంధనల్లో.. ఏముందంటే? ఈ చట్టం ప్రకారం ఎన్నికలతో సంబంధం ఉన్న వర్గాల మధ్య శత్రుత్వాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. మతం, జాతి, ప్రాంతం, సామాజికవర్గం, భాషా పరమైన భావాలను రెచ్చగొట్లేలా వ్యవహరించరాదు. పౌరులను విభజించేందుకు ఎవరు ప్రయత్నించినా వారు శిక్షకు అర్హులవుతారు. అందుకోసం మూడేళ్ల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలూ కలిపి అమలు చేయవచ్చు.