ఈ తెలంగాణ ‘వైట్ హౌస్’ ఎవరిదో తెలుసా?

ఈ ఇల్లు నాలుగు సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయిన ఒక మహోన్నత మనిషిది. 
ఆయన పేరు ఉప్పల మల్సూర్, సూర్యాపేట నియోజక వర్గం నుండి 1952 నుండి 1972 మధ్య చాలా సార్లు అసెంబ్లీకి గెలిచాడు.  మొదట 1952-56 మధ్య పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున  హైదరాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యే  అయ్యారు.తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 1956-57, 1957-62, 1962-67, 1967-72లో రిజర్వుడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వీటిలో చివరి రెండు ఎన్నికలను సిపిఎం తరఫున పోటీ చేసి గెలిచారు.

ఆతర్వాత ఆయన గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయన కనుమరుగయ్యారు పాలిటిక్స్ లోనే కాదు, చరిత్రలో కూడా. మళ్లీ ఆయన పేరు వినిపించింది రెండేళ్ల కిందటే.

2016 లో ఆయన విగ్రహాన్ని సొంతవూరు సిరికొండ గ్రామంలో (మోతె మండలం) కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి ఆవిష్కరించారు.

ఆయన ఎలా ఉంటారో ఈ తరానికి చెందిన చాలా మందికి కనిపించిందపుడే. ఈ విగ్రహమూ లేకపోతే, కామ్రెడ్ మల్సూర్ గురించి గుర్తొచ్చేదే కాదేమో.

కనీసం ఫ్రీడమ్ ఫైటర్ కోసం కూడా దరఖాస్తు చేసుకోని నిజాయితీ ఆయనది.
నాలుగు సార్లు అసెంబ్లీ కి పోయిన మల్సూర్ కి చరిత్ర కాదు కదా 
కనీసం వికి పేజీ కూడా లేదు. 

ఇపుడు తెలంగాణలో ఎన్నికలు సందడి జోరుగా వుంది. అవి చేస్తాం, ఇవి చేస్తాం, మీ ఇంటికొచ్చి అన్నింటిని సప్లయి చేస్తామని  రూలింగ్ పార్టీ ఒక పక్క, అపోజిషన్ పార్టీలు మరొక పక్క గోల గోల చేస్తున్నాయి.అన్ని పార్టీలు అభ్యర్థుల మీద కోట్లు కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. నోట్లు, మందు, బిరియానీ పంచకపోతే, గెలవ లేమన్నభయం నాలుగేళు అధికారంలో ఉన్న పార్టీలో, ప్రతిపక్షం లో కూర్చున్న పార్టీలలో సమానంగా కనిపిస్తుంది. నిజాయితీగా గెలిచే ధైర్యం ఎవ్వరిలో లేదు. పార్టీ టికెట్ అంటే డబ్బు,  ఎన్నికలంటే డబ్బు. గెలవడమంటే డబ్బు. రాజకీయాలంటేనే డబ్బు.   ఇలాంటి వాతావరణంలో మల్సూర్ లాంటి వాళ్లను గుర్తు చేసుకోవాలి. అందరికి గుర్తు చేయాలి.

ఎన్నికలు నిజాయితీగా జరిగినంత కాలం మల్సూర్ లాంటివాళ్లు నెగ్గుతూ వచ్చారు. మల్సూరు లాంటి వాళ్లు కనమరగవడం, ఎన్నికలు వ్యాపారం కావడం ఒకేసారి జరిగాయి. 

ఈ కాలంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడంటే నాలుగు వందల కోట్ల ఆస్తికి తక్కువ వెనకేయరు. ఇపుడున్న కమిషన్ పాలిటిక్స్ లో  మల్సూర్ లాంటి వాళ్లు జ్ఞాపకంగా కూడా మిగలకుండా  మాయమవుతారు. అందుకే ఆయన గురించి ఇంటెర్నెట్ లో ఎంత వెదికినా ఏమీ దొరకడం లేదు.

(ఫోటో, ఇన్ పుట్స్ గుర్రం సీతారాం ఫేస్ బుక్ వాల్ నుంచి)