ఎన్నికల్లో ఓట్ల కోసం నాయకులు జనాలకు డబ్బులు పంచుతారనే విషయం మనకు తెలిసిందే కదా! గెలిస్తే ఓకే. ఓడిపోతే ఏం చేస్తారు? నెత్తిన గుడ్డేసుకుని, ముఖాన్ని వేలాడేసుకుని ఇంటిముఖం పడతారు. ఇదీ మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మాత్రం ఓ భర్తగారు రివర్స్ గేర్ వేశారు. డబ్బులు పంచినప్పటికీ.. తన భార్య ఓడిపోయిందని తెగ ఫీలయిపోయిన ఆయన నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లాడు.
తాను పంచిన డబ్బులను వెనక్కి ఇమ్మని గదమాయిస్తున్నాడు. డబ్బులు తీసుకుని కూడా తన భార్యకు ఓటు వేయలేదనేది ఆయన అక్కసు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డి గూడెం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. ఓ వార్డులో కాంగ్రెస్ నాయకురాలు ఉప్పు హైమావతి పోటీ చేశారు. సహజంగానే ఎన్నికల్లో గెలవడానికి భారీగానే డబ్బు ఖర్చు పెట్టారు. ఒక్కో ఓటరుకు రూ.500-రూ.700 వరకు పంచారట. ఎన్నికల్లో గెలుస్తానని ధీమాగా ఉన్నారు.
తీరా ఫలితాలు చూసేసరికి కళ్లు బైర్లు కమ్మాయ్. ఎన్నికల్లో 269 ఓట్లు ఉండగా ఆమెకు 24 ఓట్లే పడ్డాయి. దీనితో హైమావతి భర్త ప్రభాకర్‌కు గ్రామస్తులపై కోపం నషాళానికి చేరింది. ఓటర్ల ఇళ్లకు వెళ్లి మరీ డబ్బులు వెనక్కి ఇచ్చేయాల్సిందిగా పట్టుబట్టాడు. మొదట్లో మర్యాదగా అభ్యర్థించిన ప్రభాకర్.. ఆపై డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ తతంగమంతా ఎవరో వీడియో తీయడంతో అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.