బిజెపి, టిఆర్ ఎస్ దగ్గరవుతున్నాయి, అమిత్ షా సాక్షిగా

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన తుస్సు మనింది. అమిత్ షా వచ్చి, తెలంగాణలో సాగుతున్న ‘అవినీతి, కుటుంబ పాలన’ మీద నిప్పులు చిమ్మి, బిజెపిలో కొత్త ఉత్సాహం నింపి వెళతారనుకున్నారు.గతంలో షా తెలంగాణ వచ్చినపుడల్లా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ని టిఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం  చేయాలంటూ పిలుపు నిచ్చే వారు.  టిఆర్ ఎస్ పాలన మీద కూడా విపరీతంగా విమర్శలు చేసే వారు. దీనితో  ముఖ్యమంత్రి కెసిఆర్  కూడా బేజారెత్తి అమిత్ షా మీద తన శైలిలో చురక లేసేవారు.  పోయిన సారి లాగా కాకుండా ఈ సారి అమిత్ షా టిఆర్ ఎస్ ప్రభుత్వం జోలికి వెళ్ల లేదు. గత ఏడాది ఏప్రిల్ లో తెలంగాణవచ్చి, నల్గొండ జిల్లాలో పెద్దదేవుల పల్లి లోని ఒక దళిత కుటుంబంలో భోజనం చేసి బిజెపిని దళితల పార్టీ అని చెప్పే ప్రయత్నం షా చేశారు. తెలంగాణా లో బిజెపి పవర్ లోకి వస్తుందని గట్టిగా చెప్పారు. ఆయన అటుపోగానే, ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి అధ్యక్షుడి దళిత బోజనం గుట్టు రట్టు చేశారు. అమిత్ మెక్కింది దళితుడి భోజనం కాదు,దాన్ని దళితులు తయారు చేయలేదు, అది నల్గొండలో బాగా పేరున్న అగ్రవర్ణకులం వాళ్లు నడిపే ‘అన్నపూర్ణ మెస్’ నుంచి తెప్పించిన పసందయిన భోజనమని షా గాలితీసేశారు.  ఇలాంటి అమిత్ షా ఈ సారి తెలంగాణ ప్రభుత్వం జోలికి వెళ్ల లేదు. అదే విధంగా అమిత్ షా పర్యటనను తెరాస కూడా చాలా హుందా గా తీసుకుంది. ఒక్కమాట అనలేదు. ఇది వేరేకథ కాదు, కథలో భాగమే.

బిజపి నేతలతో అమిత్ షా

2019లో టిఆర్ ఎస్ కు బిజెపి ప్రత్యామ్నాయం కావాలని గత పర్యటననలో హూంకరించిన అమిత్ షా ఈసారి కడుపులో చల్ల కదలకుండా పెద్ద పెద్ద రాజకీయాలు డైలాగులు మాట్లాడకుండా ఎందుకు వెనక్కి వెళ్లి పోయారు? బిజెపి నాయకులు సరే తెలంగాణ మిడియా కూడా ఆయన మౌనంలోని రాజకీయం కంటే, అమిత్ షా సారు సైనా నెహ్వాల్ ఇంటికి వెళ్లడాన్ని బాగా హైలైట్ చేస్తున్నయి. దీంట్లో ఏమయినా మీనింగ్ వేరే వుందా?

దక్షిణాది జయించేందుకు తెలంగాణా మాకు ముఖద్వారం అని అరిచిన అమిత్ షా  ఈసారి అధికార  పార్టీ జోలికివెళ్లకుండా, టిఆర్ ఎస్ ప్రభుత్వంతో ఏలా పోరాడాలో గైడెన్స్ ఇవ్వకుండా, పార్టీ నేతల  మీదే అరవడం ఏమిటి? నిజానికి, రాష్ట్ర బిజెపి నాయకులు, ముఖ్యంగా లక్ష్మణ్ పార్టీ అధ్యక్షుడయినప్పటినుంచి టిఆర్ఎస్ మీద తీవ్రంగా పోరాడుతున్నారు. యాత్రలు చేస్తున్నారు. ధర్నాలు చేశారు. ఇలాంటి బిజెపిని పట్టుకుని తెలంగాణలో మీరు పోరాడం లేదు, ప్రభుత్వం అవినీతి పోరాటం చేయాలని నాయకులకు సలహా ఇవ్వడమేమిటి?

ఎన్నికల దగ్గరుపడుతున్నపుడు అమిత్ షాలో ఈ  మార్పు కనిపించింది. టిఆర్ ఎస్ మీద మెతక వైఖరి కనిపిస్తూ ఉంది. టిఆర్ ఎస్కు, బిజెపికి ఏదో అవగాహనకుదిరందన్న అనుమానాలను ఇది బలపరుస్తుంది. టిఆర్ ఎస్ మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నదన్న అనుమానాలు రాష్ట్రంలో సర్వత్రా ఉన్నాయి.

కాంగ్రెస్ కు, బిజెపికి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంటు ముఖ్యమంత్రి కెసిఆర్ అనగానే మొదట వినిపించిన జోక్ ‘అది మోదీ అజండా’అని. చచ్చి బతికేందుకు నానా అగచాట్లు పడుతున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఫ్రంటు ఏమిటి? కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏమిటి? బిజెపి వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్ తో కలసి ఒక బిజెపి వ్యతిరేక ఫ్రంటు కట్టకుండా కెసిఆర్ మూడో ఫ్రంట్ కడుతున్నాడని, అది బిజెపికి లాభించే చర్య అని విమర్శలొచ్చాయి. ఈ పెడరల్ ఫ్రంట్ మిషన్ మీద ఆయన  బెంగాల్ వెళ్లారు, తమిళనాడు వెళ్లారు, కర్నాటక వెళ్లారు, ఒరిస్సా ముఖ్యమంత్రితో  మాట్లాడారు.జార్ఖండ్ పార్టీత్ మాట్లాడారు. వాళ్లెవరూ  కాంగ్రెస్ ను దూరం చేసుకోవాలనుకోలేదు. దానితో ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన  చల్లబడింది. అయితే, దీని వల్ల మోదీ, కెసిఆర్ మధ్య స్నేహం పెరిగినట్లుంది.

 

సైనా నెహ్వాల్ కుటుంబ సభ్యులతో అమిత్ షా

కెసిఆర్ ఢిల్లీ వెళ్లి మోదీ ‘ముందస్తు  ఎన్నికలు, జమిలి ఎన్నికలు’ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చి వచ్చారు. అంతేకాదు, 2014 విభజనచట్టంలోని అంశాలను అమలుచేయకపోయినా, కెసిఆర్ , ఆంధ్రా సింఎ చంద్రబాబు లాగాగొడవ చేయడం లేదు. మహా అంటే, అపుడుపుడు ఒక కేంద్రం ఇచ్చిన  హామీల మీద ఒక కాయితం ఇస్తూ, తానొవక్క, ఇతరులను నొప్పింపక చక్కగా స్నేహం కొనసాగిస్తున్నారు. జనంలో వినపడుతున్న వివరణ సులభం.  దేశరాజకీయాలలో రెండే కూటాలున్నాయి. ఒకటి కాంగ్రెస్ చుట్టు తిరుగుతుంది. రెండోది బిజెపి జట్టు. తెలంగాణ టిఆర్ ఎస్ కు ప్రధాన శత్రువు కాంగ్రెస్. కాబట్టి ఏ కోశాన కాంగ్రెస్ బలపడే చర్యను కెసిఆర్ చేపట్టరు. తెలంగాణలో నే కాదు, కేంద్రంలో కూడా ‘ కాంగ్రెస్ ముక్త భారత్ ’ యే టిఆర్ ఎస్ స్లోగన్ కూడా. అందువల్ల బిజెపి, టిఆర్ ఎస్ సహజ స్నేహితులు. ఈ బంధం ఆవశ్యకతను రెండు పార్టీ ఢిల్లీ స్థాయిలో గుర్తించాయనేందుకు అమిత్ షా పర్యటన, ఆయన రాజకీయ మౌనం సాక్ష్యం.బిజెపి , టిఆర్ ఎస్ లు  సహకరించకుంటాయనేందుకు పెద్ద రాజకీయ పాండిత్యం అవసరం లేదు.

సూర్య దినపత్రిక నుంచి

దానికి తోడు బిజెపి తెలంగాణ నుంచి పెద్ద గా ఏమాశించాలి. ఏమిఆశించనపుడు టిఆర్ ఎస్ తో గొడవెందుకు. పొత్తు లేకుండా ఉండొచ్చు. ఇపుడున్న పరిస్థితుల్లో , మరొక పార్టీతో పొత్తున్నా, లేకపోయినా, బిజెపికి వచ్చేవి నాలుగయిదు సీట్లే.  కాబట్టి, టిఆర్ ఎస్ జోలికి వెళ్లకుండా ఉంటే, రెండు ప్రయోజనాలున్నాయి. కాంగ్రెస్ తెలంగాణ లో రాకుండా కెసిఆర్ చూసుకుంటారు. అవసరమయితే, కొంత సాయం చేయవచ్చు. ఆపై 2019లో ఎన్నికల తర్వాత ఎన్డీయేలో టిడిపి ఖాళీ చేసిన స్థానంలోకి టిఆర్ ఎస్ ను ఆహ్వానించవచ్చు. క్విడ్ ప్రో క్వో. ఇంత తతంగం వుందికాబట్టి నిన్నటి అమిత్ షా పర్యటన బిజెపి కార్యకర్తలకు చికాకు తెప్పించింది. ఆయన పర్యటన ఏ మాత్రం ఈ నాయకత్వానికి ఫ్రెండ్లీగా లేదని ఎంకరేజింగ్ గా లేదని అనిపించింది. ఆయన పర్యటన మొదట సారి నేతలను, కార్యకర్తలను నిరుత్సాహపరిచింది.

(ఫోటో కర్టసీ  @BJP4Telangana)