జనసేనాని పవన్ కళ్యాణ్‌తో కేటీయార్ భేటీ.?

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.! ఇక్కడెవరూ శాశ్వత శతృవులు.. శాశ్వత మిత్రులు వుండరు. రాజకీయం అంటేనే అంత.! అసలు  విషయమేంటంటే జనసేనపార్టీని భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ దువ్వుతున్నారన్న ప్రచారం తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో జనసేన – టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, వ్యూహాత్మకంగా ఈ బంధాన్ని తెగ్గొట్టేందుకు ఏబీఎన్ రాధాకృష్ణ తనదైన స్టయిల్లో ప్రయత్నించారు. ఆ ప్రయత్నం దాదాపు సఫలమైనట్టే. జనసేన నేతలు, టీడీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరోపక్క, టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తోంది.

ఇదిలా వుంటే, హైద్రాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భేటీ కానున్నారన్న ప్రచారం తెరపైకొచ్చింది. గతంలో ఓ సినిమా ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ – కేటీయార్ కలిశారు. అది పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్. ఆ వేడుకకి కేటీయార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అప్పట్లో కేటీయార్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు గుప్పించారు. చాలాకాలం క్రితం టీఆర్ఎస్ – జనసేన మధ్య మాటల యుద్ధం జరిగిన మాట వాస్తవం. అది గతం. ఇప్పుడైతే ఆ ‘హీటెడ్ రాజకీయం’ లేదు రెండు పార్టీల మధ్యా. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి, జనసేన అవసరం వుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌తో కేటీయార్ భేటీ కాబోతున్నారట. వెయ్యి కోట్ల ప్యాకేజీ సంగతేంటి.? అంటే, అది ఏబీఎన్ రాధాకృష్ణ పిచ్చితనం అంతే.!