2024 Elections : 2024 అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ ‘క్లారిటీ’, ‘కాన్ఫిడెన్స్’ ఇదీ.!

2024 Elections : ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా.? అసలంటూ మంత్రి వర్గ విస్తరణ వుంటుందా.? అలాంటిదేమీ లేకుండానే ముందస్తు ఎన్నికలకు వైసీపీ వెళుతుందా.? ఈ విషయమై వైసీపీ వర్గాల్లోనే స్పష్టత లేదు. ‘మాకు పదవులు వస్తాయా.? రావా.?’ అని వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు అధినేతను నిలదీసే పరిస్థితి వస్తోందంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది.

‘పదవుల విషయమై ఎందుకంత రచ్చ.? దానికింకా సమయం వుంది. అయినా, పార్టీ కోసం పని చేయడం కంటే గొప్ప పదవి ఏముంటుంది..’ అంటూ ముఖ్యమంత్రి తన మంత్రి వర్గంలో పని చేసే మంత్రులకు క్లాస్ తీసుకున్నారన్నది ఓ వర్గం మీడియా వండి వడ్డించిన కథనాల సారాంశం.

అయితే, ముందస్తు ఎన్నికలపై వైసీపీ పూర్తి స్పష్టతతో వుంది. ‘అసలు ఆ అవసరం మాకేంటి.?’ అంటూ అసలు విషయాన్ని తేల్చేశారు వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ‘సకల శాఖా మంత్రి అనండీ.. ఇంకేదన్నా అనండీ..’ సజ్జల ఏం చెబితే, వైసీపీలో అదే జరుగుతుంది.. వైసీపీ ప్రభుత్వంలోనూ అంతే.

ఇదిలా వుంటే, 2024లోనే ఎన్నికలు జరుగుతాయనీ, జమిలి ఎన్నికలు కూడా వచ్చే అవకాశాల్లేవనీ వైసీపీ గట్టి నమ్మకంతో వుంది. ఈ ఏడాది జూన్‌లో మంత్రి వర్గ విస్తరణ వుండొచ్చునట. వీలైతే ఇంకాస్త ముందుగానే అయినా, మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశాల్లేకపోలేదట.

ఎప్పుడు ఎన్నికలొచ్చినాసరే, వైసీపీదే విజయం.. ఈసారి ఇంకాస్త ఎక్కువ సీట్లొస్తాయ్.. అని వైసీపీ అధినాయకత్వం గట్టి నమ్మకంతో వుంది.