ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తోన్నదెవరు.?

టీడీపీ అనుకూల మీడియాలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై అనునిత్యం ఏదో ఒక కథనం వండి, వడ్డించబడుతూనే వుంది. దాన్ని అధికార వైసీపీ ఖండించాల్సిన స్థాయిలో ఖండించలేకపోతోంది. నిజానికి, మీడియాలో వచ్చిన వార్తలు ప్రజలపై ప్రభావం చూపించడం అనే అంశంపై భిన్న వాదనలున్నాయి. ఏది వాస్తవం.? ఏది కల్పితం.? అనేదానిపై ప్రజలకు కొంత అవగాహన వున్నా, ఒక్కోసారి.. ఈ వార్తా కథనాలు అనూహ్యంగా జనం మెదళ్ళలోకి చొచ్చుకుపోవచ్చు కూడా.

ఇంతకీ, ఆంద్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై వైసీపీ వాదన ఏంటి.? వాస్తవం ఏంటి.? మీడియా చెబుతున్నదేంటి.? నిజమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి నెలా కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. దానికి కారణం, చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులు, వాటి తాలూకు వడ్డీ, వీటన్నిటికీ తోడు.. చంద్రబాబు హయాంలో విడిచిపెట్టిన బకాయిలు.. అన్నది వైఎస్ జగన్ సర్కారు ఆరోపణ.

మరి, వైఎస్ జగన్ సర్కార్ ఏం చేస్తోంది.? అంటే, కొత్త అప్పులు చేస్తోంది.. పాత బకాయిల్ని తీరుస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెబుతున్నా, వైఎస్ జగన్ హయాంలో కూడా బకాయిలు కనిపిస్తున్నాయి. దాంతో, టీడీపీ అనుకూల మీడియాలో కనిపిస్తున్న కథనాల్ని పూర్తిగా కల్పితమని అనేయలేం.

అయితే, రోజూ ఒకటే వంటకం ఎలా బోర్ కొట్టేస్తుందో.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మీడియాలో వస్తున్న కథనాలు కూడా అలాగే బోర్ కొట్టేస్తున్నాయి. ఇది ఓ రకంగా వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందన్నది నిస్సందేహం. కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతున్న దరిమిలా, ఏ క్షణాన అయినా ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద అనూహ్యంగా వెల్లువెత్తొచ్చు.

వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడంతోపాటు, బాధ్యతాయుతంగా అప్పులు చేయడం అనేది అత్యంత ముఖ్యమిక్కడ. కేవలం విపక్షాలపై ఎదురుదాడితో సరిపెట్టేస్తామంటే.. అది వైసీపీ సర్కారుకి అస్సలు మంచిది కాదు.