Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తే, వైసీపీ ఏం చేస్తుందిట.!

Pawan Kalyan : తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో.. వైసీపీకి మేలు చేస్తున్నామనుకుంటారో.. లేదంటే, తెలిసీ తెలియక వైసీపీని నిండా ముంచేస్తున్నారో.! వైసీపీ మంత్రుల తీరు ఇలాగే వుంది మరి. లేకపోతే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతనైతే విశాఖ స్టీలు ప్లాంటు మీద పోరాటం చేయాలంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉచిత సలహా ఇచ్చేయడమేంటి.?
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయాల్సింది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షం. ఆ అధికార పక్షంతో ఇతర రాజకీయ పార్టీలన్నీ కలిసి నడవాలి. ఇదీ జరగాల్సింది.! విశాఖ స్టీలు ప్లాంటు విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, ఆయా పార్టీల అసలు రంగులేంటో తెలిసిపోతాయ్.
ఓ పక్క విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వడి వడిగా పడుతోంటే, మంత్రి అవంతి శ్రీనివాస్ ఏం చేస్తున్నట్టు.? అవంతి శ్రీనివాస్ ఏమీ చెయ్యరు.. వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఏమీ చెయ్యదు. కానీ, పవన్ కళ్యాణ్ వచ్చి విశాఖ స్టీలు ప్లాంటు కోసం పోరాటం చేసెయ్యాలి.
రాజకీయాలన్నాక రాజకీయ విమర్శలు మామూలే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తే అదో లెక్క. విపక్షంలో వున్నారు గనుక, అధికార పక్షం మీద విమర్శలు విపక్షాల నుంచి దూసుకెళతాయ్. వాటిని అధికార పక్షం సమీక్షించుకోవాలి. ఎదురుదాడి చేయడం వల్ల లాభమేంటో ఆలోచించుకోవాలి.
ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా, విశాఖ స్టీలు ప్లాంటు విషయమై కేంద్రాన్ని నిలదీయాల్సిందే. ఎందుకంటే, బీజేపీతో కలిసి వున్నారు గనుక. సరే, పవన్ మాటని వినేలా బీజేపీ వుందా.? లేదా.? అన్నది వేరే చర్చ.
ఒక్కటి మాత్రం నిజం.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అత్యంత దారుణంగా వున్నాయి. ఎవరు చేయాల్సిన పని వారు చేయడం మానేసి, ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వడం ఎక్కువైపోయింది. అధికారంలో వున్నోళ్ళ బాధ్యతారాహిత్యం మరింత ప్రమాదకరం రాష్ట్రానికి.