క‌రోనా కంటే ప్ర‌మాదం ఇది అదేనా అని!

ద‌గ్గినా క‌రోనా..తుమ్మినా క‌రోనా..జ్వ‌ర‌మొచ్చిన క‌రోనా. ఇదీ భార‌త్ లో క‌రోనా ప‌రిస్థితి. చైనా స‌హా ప్ర‌పంచ దేశాల్లో క‌రోనా సోకిన‌ప్పుడు నిర్ధిష్ట‌మైన ల‌క్ష‌ణాలుండేవి. కానీ భార‌త్ కి క‌రోనా వ‌చ్చేసరికి వైర‌స్ ల‌క్ష‌ణాలు పూర్తిగా మారిపోయాయి. కాదు కాదు రూప‌మే మార్చేసుకుంది. ర‌క‌ర‌కాల కొత్త ల‌క్ష‌ణాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌నిషి ఆరోగ్యంగా ఉండి త‌న ప‌ని తాను చూసుకుంటున్నా ప‌రీక్ష చేస్తే క‌రోనా పాజిటివ్ ఉంద‌ని రిజ‌ల్ట్ లో వ‌స్తోంది. మ‌రి ఇలా జ‌రిగితే బెదిరిపోరా? ఆ బెదురులో అర్ధం లేదా? అంటే అన‌డానికి లేదు. ఇండియాలో ఉన్న డాక్ట‌ర్లు, నిపుణుల నుంచి భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

దీంతో ఎవ‌ర్ని న‌మ్మాలో? ఎవ‌ర్ని న‌మ్మ కూడ‌దో? అర్ధం కాని ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. దీనికి తోడు ఎక్క‌డికైనా బ‌య‌ట‌కు వెళ్లినా ఏ రూపంలో సోకుతుందో తెలియ‌ని అస్ప‌ష్ట‌త ఉంది. అన్నింటి కంటే దీనికే ఎక్కువ భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి. దీనిపైనా మేథావులు, ప్ర‌భుత్వాలు, వైద్యులు పూట‌కో మాట‌…రోజుకో మాట చెబుతుండ‌టం అంత‌కంత‌కు అంద‌లోళ‌న పెంచుతున్న‌ట్లు అవుతోంది. ఈ భ‌యంతో కొంత‌మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం జ‌రిగింది. క‌రోనా సోకి ఆసుప‌త్రిలో జాయిన్ చేసుకోక‌పోతే ప‌రిస్థితి ఏంటి? ప‌ట్టించుకునేది ఎవ‌రు? కుటుంబ స‌భ్యుల్నే వెంట రానివ్వ‌డం లేదు? ఆసుప‌త్రికి వెళ్లిన త‌ర్వాత వైద్యం ఎలా చేస్తారు? చ‌నిపోతే కుటుంబ స‌భ్యుల‌కు బాడీని కూడా ఇవ్వ‌రంట‌? అన్న భ‌యాందోళ‌న ఎక్కువ‌గా వ్య‌క్తం అవుతోంది.

సోష‌ల్ మీడియాలో అంత‌కంత‌కు పానిక్ సిచ్వేష‌న్ క్రియేట్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే అమెరికన్ సైకియాట్రిస్ట్‌ అసోసియేషన్‌ దీనిపై పరిశీలన జరిపింది. ఈ అసోసియేష‌న్ తో పాటు, బ‌ర్మింగ్ హాం యూనివ‌ర్శీటి ప్రోఫెస‌ర్లు ప‌రిశోధ‌న చేసారు. ఈ నేప‌థ్యంలో తాజా ప‌రిస్థితుల‌పై ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా కరోనా వైరస్‌ వ్యాప్తి కంటే..ఆందోళన ఎక్కువ మందిలో కనిపిస్తోందని తెలిపారు. ఆందోళన, భయం, స్ట్రెస్‌ వంటివి సామాజిక వ్యాప్తి జరిగినట్టు చెప్పొచ్చు అంటున్నారు. అనవసర ఆందోళన కారణంగా ఆరోగ్యవంతులు కూడా వ్యాధి నిరోధక శక్తి కోల్పోతున్నారన్నారు. పాశ్చాత్య దేశాల‌కంటే ఆసియాలో, ఇండియాలో ఈర‌క‌మైన భ‌యం ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌న్నారు.