వైనాట్ 175 అంటూ 2024 ఎన్నికలకు ఎప్పుడో శంఖం పూరించేసిన వైఎస్ జగన్… జిల్లా టూర్స్ చేపట్టారు. గత కొన్ని రోజులుగా వరుసపెట్టి మీటింగులు పెడుతూ, అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపనలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తున్న జగన్… రాబోయేది కూడా వైసీపీ ప్రభుత్వ పాలనే అని కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు. నేడు తాను చేస్తున్న శంకుస్థాపనలకు సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాలు.. 2024లో తాను మరోసారి ముఖ్యమంత్రి అయిన అనంతరం చేస్తానని చెప్పుకొస్తున్నారు. ఈ సందర్భంగా… జగన్ రెండో కంటికి పనిచెప్పారని కామెంట్లు చేస్తున్నారు విశ్లేషకులు.
2019 ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో జగన్ ప్రజలకు ఒక మాట ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తానని మాటిచ్చారు. అయితే తాను సీఎం అయ్యే నాటికే ఆర్థికంగా చంద్రబాబు ఖజానను ఖాళీ చేసేసిన పరిస్థితి.. దానికి తగ్గట్లుగా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన వైనం.. వీటికి తోడు కరోనా రూపంలో రెండేళ్లు స్థబ్ధగా గడిచిన కాలం.. రాష్ట్రానికి ఆదాయం లేని స్థితి.. అయినా కూడా ఎన్నికల్లో తానిచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం జగన్ చేపట్టారు.
కరోనా కష్టకాలలో కూడా తాను రూపొందించిన నవరత్నాల సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ముందుకుపోయారు. ఆర్ధికంగా ఎన్ని కష్టాలు వచ్చినా… ఇచ్చినమాట ప్రకారం ప్రతీ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నారు. దీంతో సంక్షేమం విషయంలో ఫుల్ మార్కులు సంపాదించుకున్న జగన్… ఇప్పుడు తన రెండో కన్నుగా చెప్పిన అభివృద్ధిపై దృష్టి సారించారు. ఫలితంగా వరుసపెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకుంటూపోతున్నారు.
గత నెలలో శ్రీకాకుళంలోని మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన జగన్.. ఇపుడు భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్పందించిన జగన్… ఈ ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మూడేళ్ళు పడుతుంది అని జీఎమ్మార్ సంస్థ అంటోందని.. అయితే దాన్ని తొందరగా రెండున్నరేళ్లలో పూర్తి చేయమని తాను కోరాను అని జగన్ చెప్పారు. అంతటితో అగని ఆయన… 2026లో ఈ ప్రాజెక్ట్ తొలి దశ పూర్తి అవుతుందని.. ఆ రోజున తానే మళ్ళీ ముఖ్యమంత్రిగా భోగాపురం వచ్చి.. ఎయిర్ పోర్ట్ ను ప్రారంభిస్తాను అని తేల్చి చెప్పారు.
అనంతరం… చంద్రబాబు నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితంలో చేసిన మంచి ఏంటో చెప్పాలని జగన్ సవాల్ విసిరారు. ప్రజలను, రాష్ట్రాన్ని అడ్డగోలుగా చంద్రబాబు అండ్ కో దోచుకున్నారని.. వారికి తెలిసిందల్లా దోచుకో పంచుకో తినుకో అన్నదే అని జగన్ అన్నారు. చంద్రబాబు మార్క్ పధకం అంటే “టీపీటీ” అని జగన్ ఎద్దేవా చేశారు. తాను బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్ లోకి.. ఏ దళారీ వ్యవస్థ లేకుండా నగదు బదిలీ చేస్తూంటే.. చంద్రబాబు మాత్రం ఎల్లో మీడియాకూ, తన అనుంగు బ్యాచ్ కి పంచి పెట్టి అంతా దోపిడీ చేశారని ఘాటు విమర్శలు చేశారు.
ఏది ఏమైనా… తన రెండో కన్ను అని చెప్పిన అభివృద్ధిపై జగన్ శ్రద్ధ పెట్టడం… ఎవరూ ఊహించని ప్రాజెక్టులు చేపట్టడం, దూరదృష్టితో గతంలో ఎన్నడూ లేని పోర్టులను సైతం వరుసపెట్టి శంకుస్థాపనలు చేయాలని ఫిక్సయ్యవడంతో… వైసీపీ కేడర్ కూడా ఉత్సాహంగా కనిపిస్తుంది.