బీ అలర్ట్ మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఎక్కడంటే..?

ఒకానొకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి అమెరికాను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కొంతకాలంగా కోవిడ్ కేసులు తగ్గి, అందరూ ఊపిరి పీల్చుకున్న వేళ.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, అమెరికాలో కనీసం 25 రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. CDC సేకరించిన వీక్లీ డేటా ప్రకారం, దక్షిణ, ఆగ్నేయం, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా పసిఫిక్ నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రూమ్‌లకు వెళ్లే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని నివేదికల్లో పేర్కొన్నారు.

ఫిబ్రవరి, మార్చి నెలల తరువాత మళ్లీ ఇంత స్థాయిలో కేసులు పెరుగుతుండటం కొత్త వేరియంట్ల ప్రభావమేనని నిపుణులు చెబుతున్నారు. కొత్త మ్యూటేషన్ల వల్ల కొన్ని రాష్ట్రాల్లో మరీ వేగంగా వ్యాప్తి జరుగుతోంది. ఈ వేసవిలో కొంత జాగ్రత్తగా ఉండకపోతే, మరోసారి కరోనా పీక్స్ రాబడుతుంది అని CDC వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సాధారణంగా అమెరికాలో కోవిడ్ ప్రభావం సంవత్సరానికి రెండు సార్లు ఎక్కువగా ఉంటుందని పరిశీలనలో తేలింది. ఒకసారి వేసవి కాలంలో (జూలై-సెప్టెంబర్) మళ్లీ చలి కాలంలో (డిసెంబర్-ఫిబ్రవరి) కేసులు ఎక్కువగా నమోదవుతాయి. ఇప్పుడు వేసవిలోనే కొత్త వేరియంట్ల కారణంగా కరోనా మళ్లీ పుంజుకుంటోంది.

ఇక కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కొన్ని కంపెనీలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాయి. పలు పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ అందిస్తున్నాయి. మళ్లీ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్ వాడకం తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు సడలించిన సంస్థలు తిరిగి కఠినంగా అమలు చేయబోతున్నాయి. అమెరికాలో మళ్లీ కోవిడ్ మాట వినిపించడమే కాకుండా, చిన్నపాటి జలుబు, దగ్గు వంటి లక్షణాలను తీసిపారేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి అని CDC సూచిస్తోంది. వేర్వేరు రాష్ట్రాలు ప్రజలకు మరోసారి మాస్క్‌లు ధరించమని, పెద్ద గుంపుల్లో ఉండవద్దని సూచిస్తున్నాయి.

దీనిబట్టి ‘కరోనా అంతరించిపోలేదు.. అందుకే అందరూజాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెకేషన్స్‌కి వెళ్లేవారు, ఈత, పార్కులకో వెళ్లేవారు కాస్త జాగ్రత్తగా ఉండడం మేలని నిపుణులు చెబుతున్నారు. కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మళ్ళీ మాస్క్ వేసుకోవడం, వేడినీటి గార్గిల్ చేయడం, చేతులు శుభ్రంగా కడగడం, వ్యాక్సిన్ డ్యూస్ ఉంటే వెంటనే వేసుకోవడం.. ఇవే ఇప్పుడు కోవిడ్ నుండి రక్షణకు తిరిగి సురక్షిత మార్గాలు అవుతాయి.