భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిని దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్ల గురించి అపోహలు నెలకొనడంతో, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ స్పందించారు.
“కొత్త వేరియంట్ల గురించిగా భయపడాల్సిన పని లేదు. అయితే, ప్రాథమిక జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. కరోనా ప్రస్తుతం తీవ్రమైన స్థాయిలో విజృంభించకపోయినా, నిర్లక్ష్యం చెయ్యరాదని సూచించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచుగా కడుక్కోవడం వంటి ప్రాథమిక ఆరోగ్య నియమాలను మళ్లీ పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
డాక్టర్ బహల్ ప్రకారం, కేన్సర్ పేషెంట్లు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువవారికి అత్యధిక జాగ్రత్త అవసరం. వీరు నిర్దిష్టంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, వైరల్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖలు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని ఆయన తెలిపారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశంలో 1,009 క్రియాశీల కరోనా కేసులు ఉన్నాయి. గత వారం 750 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళలోనే కేసులు నమోదు కాగా, ఇతర రాష్ట్రాల్లో చిన్నపాటి పెరుగుదల ఉంది. హాస్పిటల్‌లో చేరిన రేటు తక్కువగానే ఉన్నప్పటికీ, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజల సహకారం అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వానాకాలం దగ్గరపడుతున్న నేపథ్యంలో, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో కలిపి సమస్యలు పెరగకముందే జాగ్రత్తగా ఉండాలి.