Sajjala : మెట్టు దిగడానికి ప్రభుత్వం సిద్ధమేగానీ.!

Sajjala :  జీవోల్ని వెనక్కి తీసుకోవడం ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. కాబట్టి, ఇంకా ఎక్కువ యాగీ జరగకముందే పీఆర్సీ విషయమై జారీ చేసిన జీవోని ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన సద్దుమణుగుతుంది.

అవసరమైతే ప్రభుత్వం నాలుగు మెట్లు దిగడానికీ సిద్ధమేనంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగ సంఘాలు మెత్తబడతాయా.? అంటే, నిజానికి.. ఆయన ఈ వ్యాఖ్యలు ఇంతకు ముందే చేశారు. ప్రభుత్వం పీఆర్సీ విషయమై జారీ చేసిన జీవో వెనక్కి తీసుకుంటే, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.

ప్రభుత్వం మాత్రం ఓ వైపు, కొత్త పీఆర్సీతోనే వేతనాలంటూ, సంబంధిత శాఖపై ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వం చెప్పినట్టు వినకపోతే, జీతాలు జారీ చేసే శాఖ ఉద్యోగులపై చర్యలు తప్పవన్న హెచ్చరికలూ ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చర్చలెలా సాధ్యమవుతాయి.?

రోజులు గడిచిపోతున్నకొద్దీ వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఒకటో తారీఖు వచ్చేసిందంటే, ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడాల్సిందే. కానీ, ట్రెజరీ శాఖ అందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ప్రభుత్వం మాత్రం ఒత్తిడి పెంచుతోంది. కొత్త పద్ధతిలో జీతాలు వద్దే వద్దంటున్నారు ఉద్యోగులు.

మాటల్లో ‘మెట్టు దిగడం’ అనేది చేతల్లో చూపించలేకపోతోంది ప్రభుత్వం. అదే అతి పెద్ద సమస్యగా మారింది. ఇంకోపక్క, ఉద్యోగులు అన్నిటికీ సిద్ధమంటున్నారు. రేప్పొద్దున్న ఉద్యోగుల సమ్మెతో జరగకూడని నష్టం జరిగితే, దానికి ప్రభుత్వ పెద్దలే నైతిక బాధ్యత వహించాల్సి వుంటుంది.