బీసీ కులాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నాయని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీలకు రాజకీయ గుర్తింపు, ప్రాధాన్యత కల్పించింది తమ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో జగన్ హయాంలో బీసీల కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలను సజ్జల వివరించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం ప్రస్తుతం ఒక మంచి అవకాశంగా మారిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ నాయకులకు సూచించారు. జగన్ వల్ల మాత్రమే తమకు భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనను బీసీలందరిలో కలిగించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్లాలని కోరారు.
బీసీల కోసం వైఎస్సార్‌సీపీ చేసిన పనులు ప్రజలకు తెలుసు:
జగన్ ప్రభుత్వం బీసీ కులాలకు ఒక ఉనికిని, సమగ్ర విధానాన్ని తీసుకొచ్చిందని సజ్జల అన్నారు. దీనివల్ల అందరికీ అభివృద్ధి ఫలాలు అందాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదని, అవి ప్రజలకు అర్థమవుతున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారని, టీడీపీ ఫేక్ ప్రచారంతో అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని, వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పార్టీ గళాన్ని బలంగా వినిపించాలని కోరారు.
బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్: రమేష్ యాదవ్
ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్ గతంలో వారికి రాజకీయంగా మంచి స్థానం కల్పించారని గుర్తుచేశారు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు బీసీ కులాలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు జరిగిన మేలు ఎవరూ మరిచిపోరని అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలను వంచిస్తోందని, అబద్ధపు హామీలు, మాయమాటలతో వారిని నిలువునా ముంచిందని రమేష్ యాదవ్ ఆరోపించారు.
ఈ సమావేశంలో రమేష్ యాదవ్‌తో పాటు బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణ, పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, కార్యదర్శి అంకంరెడ్డి నాగనారాయణ మూర్తి, 48 బీసీ కులాల సాధికార అధ్యక్షులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. వివిధ స్థాయిలలో కమిటీ నిర్మాణ స్వరూపం, ఇతర ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.


