Sajjala Ramakrishna Reddy: వైసీపీకి మరో బిగ్ షాక్… సజ్జల కూడా జైలుకేనా..?

వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై ప్రభుత్వ దృష్టి మళ్లింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని అటవీ భూముల్లో 55 ఎకరాల భూమిని ఆక్రమించి ‘సజ్జల ఎస్టేట్’ ఏర్పాటు చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే విచారణ చేపట్టిన అధికారులు, భూముల ఆక్రమణ వాస్తవమేనని తేల్చారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

తాజాగా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు గురువారం ఉదయం సదరు భూమిని స్వాధీనం చేసుకున్నారు. కంచె ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఈ భూములు ప్రభుత్వానికి చెందవని, ఇకపై ఎవరూ అటు వైపు అడుగు వేయకూడదని స్పష్టం చేశారు. భూమి స్వాధీనంతోపాటు, ఈ వ్యవహారంలో పాల్గొన్న అధికారులు, సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కేసులు నమోదు చేయనున్నారు.

ఇటు సజ్జల కుటుంబ సభ్యులపై కూడా చర్యలు తప్పవని అటవీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చెట్లు నరికి వనసంపదకు నష్టం కలిగించడంతోపాటు, ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు పరిహారం వసూలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అవసరమైతే నేరుగా జైలుకు తరలించే వరకు వ్యవహారం సాగనుందని తెలుస్తోంది. మొత్తం మీద, సజ్జల వ్యవహారం రాజకీయంగా రాష్ట్రంలో మరో చర్చనీయాంశంగా మారింది.