Punishment for IAS Officers : అధికారులకు జైలు శిక్షలు: ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారు.?

Punishment for IAS Officers : జైలు శిక్ష అంటే ఫ్యాషన్ అయిపోయింది.! కోర్టు మొట్టికాయలంటే అలవాటైపోయాయ్.! అసలు, కోర్టులు.. తీర్పులు.. వ్యవస్థలు.. వీటిని ఎలా చూడాలి.? మొన్నొక మేధావి, కనీసం డజను కేసులు వుంటే తప్ప, రాజకీయాలకు పనికిరానట్టు మాట్లాడాడు..

పైగా తనను తాను మూర్ఖుడిగా అభివర్ణించుకున్నాడు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విపరీత పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయి.?

న్యాయస్థానాలు తీర్పులిచ్చాక కూడా వాటిని అధికారులు అమలు చేయడంలేదు. దాంతో, కోర్టు ధిక్కరణ కింద సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిజానికి, ఇది చాలా సీరియస్ అంశం.

వ్యవస్థ తనను తాను ప్రశ్నించుకోవాల్సిన సందర్భమిది. ఐఏఎస్ అధికారులు కాస్తా, ‘అయ్యా యెస్’ అనడం వల్లే ఈ దుస్థితి అన్నది నిర్వివాదాంశం.

సీనియర్ ఐఏఎస్ అధికారులకు న్యాయస్థానం రెండు వారాల జైలు శిక్ష విధించడమంటే, ఈ విషయంపై ప్రజలు ఎలా ఆలోచించాలి.? వాళ్ళెలా నడుచుకోవాలి.? అన్న చర్చ జరగడం సహజమే.

కోర్టుతో చీవాట్లు తిన్న అధికారులు, ఉన్నతాధికారులుగా చెలామణీ అవుతూ.. పరిపాలనలో భాగమవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రాజకీయ నాయకులపై కేసులు, పైగా క్రిమినల్ కేసులు కొత్త విషయమేమీ కాదు. జైలుకెళ్ళి రావడమంటే అదో ఘనతగా రాజకీయ నాయకులు భావిస్తున్న రోజులివి. ముందు ముందు అధికారులదీ ఇదే పరిస్థితి అవుతుందా.? అంటే, ‘కాదు’ అని మాత్రం చెప్పలేం.

మామూలుగా అయితే పోలీస్ కేసు నమోదైతే, ఉద్యోగాలకు అర్హతలు కోల్పోవడం అనేది సామాన్యుల విషయంలో జరుగుతుంటుంది. చట్టం, న్యాయం అందరికీ ఒకేలా వుండాలా.? వద్దా.? అన్న ప్రశ్న కూడా ఇలాంటి సందర్భాల్లోనే తెరపైకొస్తుంటుంది.